Jun 06,2023 21:39

జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద ఇంటింటికి వేసిన కుళాయిల నుంచి నీటి సరఫరాను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌


నిరంతరాయంగా నీటి సరఫరా
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
- ఇంటింటికి కొళాయిల పనులు పరిశీలన
ప్రజాశక్తి - పాణ్యం

      మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాణ్యం మండలంలోని కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తండాలో జలజీవన్‌ మిషన్‌ పథకం కింద 25 లక్షలతో మంజూరై పూర్తయిన తాగునీటి పైపులైన్లను, కుళాయిలను, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ తండాలోని ప్రజలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, రోడ్డు చదును తదితర సమస్యలను కలెక్టర్‌కు తండా ప్రజలు విన్నవించారు. విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌ ఇంటి ఆవరణలో ఉందని, ఇతర ప్రదేశానికి మార్పించాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డుకు ఇరుపక్కల గ్రావెల్‌ మట్టితో సమాంతరంగా చదును చేయాలని అధికారులను ఆదేశించారు. మురికి కాలువలను శుభ్రపరిచి డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఎంపీడీవోకు సూచించారు. విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్‌ మార్పురనకు చర్యలు చేపట్టాలరన్నారు. అనంతరం ఒహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకును పరిశీలించి శుభ్రపరచిన తేదీని రాయాలని సూచించారు. మంచినీటి కొళాయిలు, ఏర్పాటు చేసిన పైపులైన్ల నాణ్యతను కలెక్టర్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మనోహర్‌, డిఈఈ మధుసూధన్‌, ఏఈ మధుశేఖర్‌, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.