పుట్టపర్తి అర్బన్ : ప్రజా సేవలో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకమని, ఈ శాఖలో విధులను నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు. మంగళవారం నాడు కలెక్టరేట్‌లో రీ సర్వే, ఎస్‌పిఒఎల్‌ఆర్ మ్యూటేషన్స్, ఇంటి స్థలాలు, స్పందన, వివిధ కోర్టు కేసుల పరిష్కారం, భూ సేకరణ తదితర అంశాలపై జిల్లా స్థాయి రెవెన్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకమన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో నుంచి ఆర్డీవో వరకు అందరూ కష్టపడి పని చేసి ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, సర్వే శాఖలు వేర్వేరు కాదని, రెండు ఒకటేనన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కషి చేయాలన్నారు. కోర్టు కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పనిచేయాలన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు సంబంధిత అధికారులు ప్రతిరోజూ సమస్యలపై సమీక్షించాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో రెవెన్యూ శాఖ అధికారులు తగిన సహకారం అందించాలన్నారు. అన్ని లేఅవుట్ల అభివద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలకు స్థలం కేటాయింపు విషయంలో త్వరగతిన చర్యలు చేపట్టాలన్నారు. ధ్రువీకరణ పత్రాల మంజూరులో గోరంట్ల, మడకశిర, ఓడి చెరువు, కదిరి, పుట్టపర్తి, నల్లమాడ, బుక్కపట్నం, సోమందేపల్లి మండలాలు వెనుకబడి ఉన్నాయని ఇక్కడ పనుల్లో పురోగతి పెరగాలన్నారు. రీ ఓపెన్ అర్జీలకు సంబంధించి లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌ఒ కొండయ్య, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవానీశంకర్, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పేనాయక్, డిఎస్‌ఒ వంశీకష్ణతో పాటు జిల్లాలోని తహశీల్దార్లు పాల్గొన్నారు.










