Oct 30,2023 21:14

ఫొటో : డిపో ఎదుట నిరసన ధర్నా చేపడుతున్న ఆర్‌టిసి కార్మికులు

నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఇటీవల కావలి ఆర్‌టిసి డ్రైవర్‌పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సోమవారం ఆత్మకూరు ఆర్‌టిసి డిపోలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అక్టోబర్‌ 26వ తేదీన కావలి మద్దూరుపాడు వద్ద వెళుతున్న బస్సును ఆపి డ్రైవర్‌ను, కాలితో తన్నుతూ పిడి గుద్దులతో దాడి చేసిన ఘటన అత్యంత దారుణమన్నారు. ఈ సంఘటన వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో వైరల్‌ అయిందని తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అత్యంత దారుణంగా దాడి జరుగుతుంటే బస్సులో ప్రయాణికులు చుట్టుపక్కల ప్రజలు ఉన్నప్పటికీ వారిని అడ్డం తీసే ప్రయత్నం కూడా చేయకపోవడం శోచనీయమన్నారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనేక సందర్భాలలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం జరిగిందని, ఇది ప్రజాస్వామ్యానికి భంగం లాంటిదని, ఇటువంటి సంఘటనలను తీవ్రంగా ఖండించాలన్నారు. అనంతరం స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు ఎన్‌.భాస్కర్‌, షేక్‌ మొహమ్మద్‌ అలీ, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఏ.ప్రతాప్‌ రెడ్డి, కార్మిక సంఘం నాయకులు పెంచలయ్య, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు కే సుధీర్‌, ప్రసంగించారు. ఈ ధర్నాకు సంఘీభావంగా సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ నాగయ్య, కొండమూరి హాజరత్తయ్య, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రిజ్వాన్‌ హాజరై మద్దతు తెలియజేశారు. ధర్నా కార్యక్రమంలో ఎం.చెన్నయ్య, సుందరయ్య, ఎస్‌డి ఇస్మాయిల్‌, టి.బాలకృష్ణ, తదితర కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.