Sep 14,2023 21:34

వృద్ధుడితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

         ప్రజాశక్తి-అనంతపురం   'పూటకో మాట రోజుకో గడప' జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీరు అని వరస అని ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి మండిపడ్డారు. గురువారం సాయంత్రం రాప్తాడు మండల కేంద్రంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూవైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. నిలకడ లేని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని ధ్వజమెత్తారు. 2014లో పార్టీ పెట్టాడు కానీ పోటీ చేయలేదు. చంద్రబాబు జెండా పట్టుకుని దేశమంతా తిరిగాడు. ఆయనను గెలిపించాడు. చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తే ఆ మోసంలో ప్రధాన పాత్రదారి పవన్‌ కళ్యాణ్‌. 2019లో ప్రత్యేకంగా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేశాడు. ఆ సమయంలో చంద్రబాబు దోపిడీదారుడు, దుర్మార్గుడు, లక్ష కోట్లు తిన్నాడంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. మరి ఈరోజు సిగ్గు లేకుండా అదే చంద్రబాబుతో కలిసి ఒప్పందం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి జంటగా జనాల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. సొంతంగా పార్టీ పెట్టి జెండా అజెండా లేని వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. తాను సీఎం అభ్యర్థి అని చెప్పుకోలేని వ్యక్తి. ఎంతసేపూ చంద్రబాబు భజన పాడుతాడు. జయం జయం చంద్రన్న అంటూ పాట పాడడం తప్ప నేను సీఎం అవుతా ప్రజలకు పలానా చేస్తా అని చెప్పలేని చవట దద్దమ్మ పవన్‌ కళ్యాణ్‌. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్న చందంగా వీరి పొత్తుతో ఒరిగేదేమీ లేదు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.