ప్రజాశక్తి - హాలహర్వి
మండలంలోని బాపురం స్కీం నుంచి వదిలే నీటిని శుద్ధి చేసి వదలాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి లక్ష్మినారాయణ కోరారు. శుక్రవారం బాపురం స్కీంలో ఫిల్టర్ బెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం ఆలూరు నియోజకవర్గం ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆలూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బాపురం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారన్నారు. 5 ఫిల్టర్ బెడ్ల ద్వారా 27 గ్రామాలకు నీటిన సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఫిల్టర్ బెడ్లను మరమ్మతులు చేయకుండా, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు కాంట్రాక్టర్లకు వదిలేసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నీటిని తాగి గూళ్యం గ్రామస్తులు దాదాపు 50 మంది పక్షవాతం, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు 5 ఫిల్టర్ బెడ్లను పట్టింకుకోకపోవడంతో అధ్వాన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆలూరు పట్టణానికి కేటాయించిన 3 ఫిల్టర్ బెడ్లలో ఒకటి కలుషితమైన నీరు, మరోదాంట్లో చెత్తాచెదారం వదిలేయడంతో ఫిల్టర్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించాలని, తుంగభద్ర నీటిని ముందస్తుగా స్టోరేజ్ చేసుకోవాలని కోరారు. ఈ విషయం గురించి మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గూళ్యం ఎల్లప్ప, గంగాధర్, టిడిపి, ఎంఆర్‌పిఎస్ నాయకులు పాల్గొన్నారు.
బెడ్లను పరిశీలిస్తున్న లక్ష్మీనారాయణ










