Aug 07,2023 19:46

దాడిలో గాయపడిన అబ్దుల్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
'మా గ్రామంలో వాటర్‌ ప్లాంట్‌ పెట్టుకుని మేము నీళ్ల వ్యాపారం చేస్తుండగా వేరే గ్రామానికి చెందిన నువ్వు మా ఊరికి వచ్చి నీళ్ల వ్యాపారం ఎలా చేస్తావ్‌' అని దాడి చేసి గాయపరచిన సంఘటన మండలంలోని ఏరూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌బాబు వివరాల మేరకు... చిప్పగిరి గ్రామానికి చెందిన ఖలీల్‌ కుమారుడు అబ్దుల్‌ తమ వాటర్‌ ప్లాంట్‌ నుంచి తాగునీటిని ఆటోలో తీసుకెళ్లి ఏరూరు గ్రామంలో అమ్ముతున్నారు. ఏరూరు గ్రామానికి చెందిన వాటర్‌ ప్లాంట్‌ యజమాని మక్తం కుమారుడు షాకీర్‌ దాడి చేసి గాయపరిచారు. సోమవారం బాధితుడు విలేకరులతో మాట్లాడారు. దాడికి దిగుతూ చంపుతానని బెదిరిస్తున్నారని, ఏరూరు గ్రామస్తులు రమ్మన్నందుకే తాగునీరు సరఫరా చేయడానికి ఆటోలో వెళ్లానని తెలిపారు. తనపై దాడి చేసి తల పగలగొట్టడమే కాకుండా, తాను తీసుకెళ్లిన ఆటోను కూడా ధ్వంసం చేసినట్లు వాపోయారు. ఈ విషయంపై ఎస్‌ఐ రమేష్‌ బాబును వివరణ కోరగా... బాధితుడు అబ్దుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.