May 18,2023 22:16

పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ముందస్తు అడ్మిషన్లను చేపడుతున్న నారాయణ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా బాబావలి మాట్లాడుతు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ముందస్తు ప్రచారాలు, అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా యూకేజీ నుండి పదవ తరగతి వరకు రూ.26 వేల నుంచి 40వేల రూపాయల వరకు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అయితే విద్యార్థులకు క్రీడా మైదానం, మౌలిక సదుపాయాలు కూడా సరిగా కల్పించ లేదన్నారు. ఫీజులతో పాటు ఇక్కడే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, బుక్స్‌, టైలు కొనాలని నిబంధన పెట్టి రూ. 6 నుంచి 12వేల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చిన నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇటీవల ఫీజు నియంత్రణ చట్టం తీసుకోచ్చి, దీని కోసం జీవో నెంబరు 53ను విడుదల చేసిందన్నారు. దీనిని అనుసరించి ప్రాథమిక విద్యకు రూ.11వేలు, ఉన్నత విద్యకు రూ.15వేలు ఫీజులు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నిబందనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్‌ చేశారు. అయితే విద్యాశాఖ అధికారులు మాముళ్లు తీసుకుని వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిబందనలు అతిక్రమిస్తున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోక పోతే ఆలాంటి విద్యా సంస్థలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులు చేపడుతామని హెచ్చరించారు. దీనికి విద్యాశాఖ అధికారులే భాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తరుణ్‌, నిహాల్‌, నవీన్‌, మహేష్‌, లిఖిత్‌, ఆదర్శ్‌, సిరాజ్‌, నందీష్‌, భాను, తేజ, అనిల్‌ కుమార్‌, రాజేష్‌, షాహిద,్‌ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.