May 11,2023 22:22

సమావేశంలో మాట్లాడుతున్న అధికారి

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఇకపై పవర్‌లూమ్స్‌లో ప్యూర్‌ టూ ప్యూర్‌ రకాలు నేస్తే తామే నేరుగా సీజ్‌ చేస్తామని నిబంధనలు అతిక్రమించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రాజారావు హెచ్చరించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పట్టణంలోని పవర్‌ లూమ్స్‌ యజమానులు, చేనేత కార్మికసంఘాలనాయకులతో ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు. ఆర్డీవో తిప్పేనాయక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ ఆర్డీ రాజారావు మాట్లాడుతూ ధర్మవరంలో ఇటీవల కాలంలో పవర్‌ లూమ్స్‌, హ్యాండ్లూమ్‌ మధ్య సమస్య జరుగుతోందన్నారు. ఇదివరకే సమావేశాలు ఏర్పాటుచేసి పవర్‌లూమ్స్‌లో చేనేత 11రకాలు నేయరాదని చెప్పామని కొంత సమయం కూడా ఇచ్చామని, అయినా వారి తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి నుండి తాను రెండు నెలలైనా ఇక్కడే ఉండి ప్రతి రోజు పవర్‌లూమ్స్‌ను తనిఖీచేస్తానని. ఎవరైనా ప్యూర్‌ టూ ప్యూర్‌ నేస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం చేనేత కార్మికులుకడుపు మండి రోడ్డుపైకి వచ్చారన్నారు.పట్టణంలో ఇప్పటికే జాబితాను సిద్ధం చేశామని, త్వరలో జీఎస్టీ వారిని పిలిపిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ట్రాన్స్‌కో అధికారులను పిలిచి పవర్‌లూమ్స్‌కు ఉన్న విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తామన్నారు. పవర్‌ లూమ్స్‌ దాడులకు వెళ్లితే తాళాలు వేసుకుని వెళ్తున్నారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ అరుణ్‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. వీటిపై అప్‌డేట్‌ ఇవ్వాలని కలెక్టర్‌ వివరించారన్నారు. జిల్లాలో ఎవరైతే పవర్‌ లూమ్‌ చేనేత రకాలు నేస్తున్నారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సత్యసాయి జిల్లాలో ఎక్కడా పవర్‌లూమ్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయవద్దని, చేసినవాటిని కూడా రద్దు చేయాలని చేనేత జౌళిశాఖ జిల్లా ఏడీని ఎన్‌ఫోర్‌్‌సమెంట్‌ ఆర్జేడీ ఆదేశించారు. అనంతరం చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ పవర్‌ లూమ్స్‌ నిబంధనల ప్రకారమే నడుపుకోవాలని, చేనేత రకాలను నేయరాదని అన్నారు. పవర్‌లూమ్స్‌కు ప్రభుత్వం రాయితీలు, రుణాలు కూడా ఇస్తుందన్నారు. అదేవిధంగా పవర్‌ లూమ్స్‌ యజమాని పోలావెంకటనారాయణ మాట్లాడుతూ ప్రతివారం యజమానులతో సమావేశమై ప్యూర్‌ టూ ప్యూర్‌ నేయరాదని చెప్పడం జరుగుతుం దన్నారు. ఎవరైతే ప్యూర్‌ టూ ప్యూర్‌ నేస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. అయితే వేరే ప్రాంతాల నుండి పవర్లూమ్స్‌ చీరలను వాహనాలలో తీసుకువచ్చి విక్రయిస్తున్నారని వాటిని అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అప్పాజీ, హ్యాండ్లూమ్‌ సత్యసాయిజిల్లా ఏడీ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.