Jun 06,2023 21:35

cartoon

నిబంధనలకు నీళ్లు
- ఇష్టారాజ్యంగా ప్రయివేటు పాఠశాలల నిర్వహణ
- కన్నెత్తి చూడని అధికారులు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

నాలుగు ఇరికిరుకు గదులు, భవనాల్లో తరగతులు... ఇదీ చాలా ప్రయివేట్‌ పాఠశాలల తీరు. నిబంధనలను పక్కనపెట్టి కనీసం విద్యార్థులకు మైదానం లేకుండా పాఠశాలలను అడ్డగోలుగా నడిపేస్తున్నారు. వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పైపైన తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు...
    విద్యాధికారులు మాముళ్ల మత్తులో మునిగి ప్రయివేట్‌ పాఠశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. ప్రయివేట్‌ పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా అనుమతులు ఇస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని కాలరాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 శాతం ప్రయివేట్‌ పాఠశాలలు కనీస నిబంధనలను పాటించడం లేదు. తరగతి గదుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వెలుతురు, గాలితో పాటు శుభ్రత ఉండాలి. చాలా పాఠశాలల్లో రేకుల భవనాలే తరగతి గదులుగా కొనసాగుతున్నాయి. ఎలాంటి వెలుతురు ఉండడం లేదు. 40 శాతం ప్రయివేట్‌ పాఠశాలల్లో పిల్లలకు ఆడుకోవడానికి కూడా మైదానం లేదు. అనుమతుల సమయంలో విద్యాశాఖ చేతివాటం వల్ల విద్యార్థులకు క్రీడా సౌకర్యాలు ఎండమావిగా మారుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదరపు మీటర్లు, గ్రామీణ, ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పని సరిగా ఉండాలి. పాఠశాల పక్కా భవనంలో నిర్వహించాలి. కానీ చాలా పాఠశాలలు రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నాయి.
విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది..
విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం ప్రతి ప్రయివేట్‌ పాఠశాల యాజామాన్యం 25 శాతం సీట్లలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, వార్షిక ఆదాయం రూ.60 వేలలోపు ఉన్నవారి పిల్లలకు 6 శాతం, అనాథలకు 5 శాతం సీట్లు కేటాయించి ఉచిత విద్యనందించాలి. ప్రయివేట్‌ పాఠశాలలు అమలు చేయకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. సెక్షన్‌ 13 ప్రకారం విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకునేందుకు ఎలాంటి పరీక్షలూ నిర్వహించకూడదు. కానీ కొన్ని పాఠశాలలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ తల్లిదండ్రుల నుంచి డబ్బు మింగుతున్నాయి. సెక్షన్‌ 23 ప్రకారం డిఎడ్‌, బిఎడ్‌ పూర్తి చేసిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి. కానీ చాలా పాఠశాలలు పది, ఇంటర్‌, డిగ్రీ చదివిన వారితో పాఠాలు బోధిస్తున్నాయి. ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధనలను పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నా, ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప, వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. విద్యాధికారులు పర్యవేక్షణను గాలికొదిలేయడంతో ప్రయివేట్‌ యాజమాన్యాలు, కార్పొరేట్‌ బడులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.