బెంగళూరు : అంతరిక్షంలో మరిన్ని పరిశోధనల నిమిత్తం తదుపరి తరం (నెక్స్ట్ జనరేషన్) ఆస్ట్రానమీ శాటిలైట్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అన్వేషిస్తుందని ఉన్నతాధికారి ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. ఖగోళ పరిశోధనల నిమిత్తం తొలిసారిగా 2015లో సెప్టెంబర్ 28న ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. దీని సామర్థ్యం ఐదేళ్లయినప్పటికీ.... ఇది ఇప్పటికీ పనిచేస్తోంది. అయితే ఆస్ట్రోశాట్ మరి కొన్ని సంవత్సరాలు పని చేసే అవకాశాలున్నాయని ఆ మిషన్ బృందానికి నాయకత్వం వహించిన అప్పటి ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం ఆయన ఇస్రోలో సైన్స్ కమిటీ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆస్ట్రోశాట్-2 ఆవిష్కరణ అవకాశాలపై ఆయన మాట్లాడుతూ... ' అది ఆస్ట్రో శాట్ కాదు.. నెక్స్ జనరేషన్. దీన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాం. ప్రణాళిక ఏంటనే దానిపై ఆధారపడి ఉంది. ఆస్ట్రోశాట్‌ననుసరించి..భిన్నమైన పద్ధతిలో ఆవిష్కరించేందుకు కృషి చేస్తాం' అని అన్నారు.










