కొమరాడ: ప్రభుత్వం పేద ప్రజలకు అందజేస్తున్న రేషన్ బియ్యం ఈనెల 10తేదీ కావస్తున్నా జిల్లాలో నేటికీ అనేక గ్రామాల్లో ప్రభుత్వం సరఫరా చేయలేదు. దీంతో పేదలు అనేక అవస్థలుపడుతున్నారు. ప్రతినెలా ఒకటో నుంచి అందజేస్తున్న రేషన్ బియ్యం ఈనెల 10తేదీ కావస్తున్నా నేటికీ అందజేయకపోవడంతో లబ్ధిదారులు బియ్యం కోసం ఎదురు చేస్తున్నారు. ఈ మేరకు కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యాన లబ్ధిదారులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, ఎ.ఉపేంద్ర మాట్లాడుతూ నెలలో ఒకటో తారీకు నుండి 18వ తేదీ లోపు పూర్తిగా లబ్ధిదారులందరికీ వాహనం ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నెల 9తేదీ పూర్తయినా మండల కేంద్రంలో సర్వర్ సమస్య వల్ల ఎవరికీ బియ్యం ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమనే పరిస్థితి ఉందన్నారు. వెంటనే సర్వర్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేషన్ బియ్యం ఎప్పుడు ఇస్తారనే విషయం వాలంటీర్ ద్వారా గానీ, సచివాలయం సిబ్బంది ద్వారా గానీ లబ్ధిదారులకు వెంటనే తెలియజేయాలన్నారు. దసరా సందర్భంగా కేరళ మాదిరిగా 18 రకాల నిత్యవసర వస్తువులు అందజేసి లబ్ధిదారులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.










