పుట్టపర్తి రూరల్ : నేరాల నియంత్రణపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఎస్‌ఐలు, సిఐలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అనంతపురం రేంజ్ డిఐజి ఆర్‌ఎస్.అమ్మిరెడ్డి సూచించారు. జిల్లా నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నాడు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి జిల్లాలో నేరాలు, వాటి నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాలో ప్రతి స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్‌పై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. క్రమం తప్పకుండా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే రహదారులను గుర్తించి అక్కడ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పెషల్, లోకల్ చట్టాలపై పోలీస్ సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా పరిధిలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని డిఎస్పీలు, పాల్గొన్నారు.










