Oct 31,2023 00:09

నేనే రంగంలో దిగుతా : బొజ్జల బృందమ్మ

నేనే రంగంలో దిగుతా : బొజ్జల బృందమ్మ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఏమాత్రం సహించేది లేదనీ, బొజ్జల గోపాలకష్ణారెడ్డి సతీమణిగా తానే రంగంలోకి దిగుతానని బొజ్జల బందమ్మ స్పష్టం చేశారు. ఆమె స్వగ్రామం ఊరందూరులో సోమవారం తెలుగు మహిళలతో ఆమె సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులకు తలొగ్గి టీడీపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా తప్పుబట్టారు. బొజ్జల గోపాలకష్ణారెడ్డి హయాంలో పోలీస్‌ స్టేషన్లు దేవాలయాలుగా కొనియాడబడేవనీ, స్థానిక ఎమ్మెల్యే పాలనలో హింసా కూపాలుగా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపితే హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, ప్రభుత్వాస్తుల ధ్వంసం కేసులను టిడిపి నాయకులు పై బనాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నిరసన తెలిపే స్వేచ్చా స్వాతంత్య్రం తమ కార్యకర్తలకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై ఎందుకు అక్రమ కేసులు బనాయించారంటూ ప్రశ్నించిన తమ కుమారుడు బొజ్జల సుధీర్‌ రెడ్డిపై రూరల్‌ సీఐ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమన్నారు. ఓ మాజీ మంత్రి కుమారుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి తో వ్యవహరించే తీరు అది కాదని చెప్పారు. పోలీసులు అంటే ప్రజల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించాలే కానీ, భయభ్రాంతులకు గురి చేయకూడదని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే తమ కార్యకర్తలందరిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని విమర్శించారు. ఇలాగైతే ఓటింగ్‌ నాటికి టిడిపి కార్యకర్తలను అక్రమ కేసుల్లో బైండోవర్‌ చేసుకుని ఏకపక్షంగా రిగ్గింగ్‌ చేసుకునే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నట్లు ఆరోపించారు. ఎంతమందిపై కేసులు బనాయించినా, తెలుగు మహిళలే ఎలక్షన్లు ముందుండి నడిపించి టిడిపిని గెలిపించి తీరుతామని స్పష్టం చేశారు.