వర్చువల్‌గా ప్రారంభించనున్న సిఎం జగన్
- ఇప్పటి వరకూ 120 సీట్లు భర్తీ
ప్రజాశక్తి - ఏలూరు
జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'ప్రభుత్వ వైద్య కళాశాల' ఏర్పాటు కల సాకారమైంది. సిఎం జగన్ విజయనగరం నుండి ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను వర్చువల్ విధానంలో ఈనెల 15వ తేదీన ప్రారంభించనున్నారు. 2021 మే నెలలో సిఎం ఈ వైద్య కళాశాలకు శంఖుస్థాపన చేశారు. త్వరితగతిన వైద్య కళాశాల నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుండే తొలి బ్యాచ్ విద్యార్థులకు బోధన ప్రారంభించారు. ఈ కళాశాల నిర్మాణానికి ఆళ్ల నాని ఎంతో కృషి చేశారు. నిర్మాణ పనులు అతి తక్కువ వ్యవధిలో శరవేగంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ఆవరణలో వైద్య కళాశాలకు సంబందించిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసుకోగా, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బోధనాసుపత్రి, హాస్టల్ సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రంలో పలు మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 150 ఎంబిబిఎస్ సీట్లతో 2023-24 విద్యా సంవత్సరం నుండి వైద్య తరగతులు ప్రారంభించేందుకు ఎన్‌ఎంసి అనుమతిచ్చింది. దీంతో ఈ ఏడాది ఏలూరు వైద్య కళాశాలలో 150 మంది మెడికోలు తమ విద్యను ప్రారంభించడానికి అవకాశం కలిగింది. ఇప్పటికే 120 సీట్లు భర్తీ అయ్యాయి. సాధారణంగా వైద్య కళాశాలలు వైద్యంలో డిగ్రీ కోర్సును, మాస్టర్స్ కోర్సును, పిహెచ్‌డి సదుపాయాన్ని అందజేస్తాయి. ఇంతే కాకుండా వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, లేబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులను కూడా బోధిస్తాయి. వైద్య కళాశాలలకు అనుబంధంగా హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయం కూడా ఉంటుంది. వైద్యవిద్యలో బోధించే కొన్ని విద్యావిభాగాలు హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం, ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం, కుటుంబ వైద్యం, శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం), ఇవే కాకుండా గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి విషయాలకు సంబంధించిన విద్యాబోధనలకు ప్రత్యేక విభాగాలుంటాయి. వైద్య కళాశాలలున్న ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందడం గమనించొచ్చు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో డిపార్ట్‌మెంటల్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, లెక్చరర్ గ్యాలరీ, ప్రత్యేక లైబ్రరీ బ్లాక్ కూడా నిర్మాణంలో ఒక భాగంగా ఉన్నాయి.










