Sep 04,2023 21:43

చంద్రబాబు

         అనంతపురం ప్రతినిధి : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 'భవిష్యత్‌కు బాబు గ్యారెంటీ' కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సమయంలో నియోజకవర్గాల సమీక్షలు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం బళ్లారికి విమానంలో చేరకుంటారు. బళ్లారి నగరంలో కమ్మమహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తరువాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని ఓబుళాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకుంటారు. వేదవతి మీదుగా పల్లేపల్లి మీదుగా రాయదుర్గం చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు తేరు సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. కణేకల్‌ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఉరవకొండలోని కౌకుంట్ల గ్రామంలో జరిగే ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం ఒంటిమిద్ది మీదుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు టి.సర్కిల్‌లో రోడ్డు షోలో పాల్గొంటారు. వాల్మీకి సర్కిల్‌ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మూడవ రోజు పర్యటన కళ్యాణదుర్గంలో ప్రారంభమవుతుంది. మహిళా ప్రగతి కోసం వేదిక అన్న అంశంపై చర్చ ఉండనుంది. మధ్యాహ్నా భోజన విరామం తరువాత పామిడిలో వస్త్ర కార్మికులతో మాట్లాడుతారు. గుత్తి సర్కిల్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడితో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగియనుంది. అనంతపురం నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తారు.
నియోజకవర్గాల సమీక్షల్లో దిశానిర్ధేశం
భవిష్యత్‌కు గ్యారెంటీ యాత్ర సందర్భంగా మూడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా నియోజకవర్గాల సమీక్షలు సైతం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమీక్షలతోనైన టిడిపి నేతలు ఏకతాటిపైకి వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రధానంగా అందరి దృష్టి కళ్యాణదుర్గం నియోజకవర్గంపై ఉంది. 2019 ఎన్నికలకు ముందు నుంచి ఇక్కడ గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రూపు తగాదాలు నడుస్తూనే ఉన్నాయి. బాబు పర్యటన జరుగుతున్న ఈ సమయంలోనూ ఆ పార్టీ నేతలు విడివిడిగానే సమావేశాలు జరుపుతున్నారు. దీంతో అప్రమత్తమైన జిల్లా నేతలు ఇరు వర్గాలకు సర్ధిజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఏ మేరకు కొలిక్కొ వస్తాయన్నది చూడాల్సి ఉంది. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంలోనూ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈసారి అటువంటి తలెత్తకుండా ఉండే విధంగా జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక గుంతకల్లు నియోజకవర్గంలోనూ నేతల మధ్య సఖ్యతలేదు. పార్టీ కార్యక్రమాలు ఇక్కడ అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. మూడు నియోజకవర్గాల సమీక్షల్లో ఏ రకమైన మార్గనిర్ధేశం ఇస్తారోనన్నది కూడా ఆసక్తికరంగా మారింది.