Jul 16,2023 21:47

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ముఖద్వారం

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. సోమవారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరుకానున్నారు. ఆదివారం రాత్రికే గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అనంతపురం నగరం చేరుకున్నారు. నేడు జరిగే స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 57 విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు 9150 మందికి డిగ్రీ పట్టాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన సమర్థన దివ్యాంగుల సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ జికె.మహంతేష్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భువన విజయం ఆడిటోరియంలో స్నాతకోత్సవ కార్యక్రమం జరుగనుంది. కట్టుదిట్టమైన భద్రత : గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తొలిసారిగా జరుగుతున్న జిల్లా పర్యటన సందర్భంగా అనంతపురం నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన బస చేస్తున్న ఆర్‌అండ్‌బి అతిథిగృహానికి మెరుగులు దిద్దారు. ఆదివారం రాత్రికే ఆయన వస్తుండటంతో ఉదయం నుంచే ప్రధానమైన కూడళ్లలో పోలీసు పహార ఏర్పాటు చేశారు. అదే విధంగా సప్తగిరి సర్కిల్‌ నుంచి ఆర్‌అండ్‌బి వైపు వెళ్లే మార్గంలో తోపుబండ్లను రోడ్డుకు అడ్డంగా లేకుండా పక్కకు తొలగించారు. రాత్రికి ఆయన ఇక్కడే బస చేసి సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వెనుదిరుగనున్నారు. ఈయనకు జిల్లా కలెక్టరు గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావులు స్వాగతం పలికారు. గవర్నర్‌ పర్యటన సాగునుంది ఇలా ... ఆదివారం మధ్యాహ్నం 3 : 45 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 5 : 55 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం బయలుదేరుతారు. మధ్యలో కొడికొండ చెక్‌పోస్టు వద్దనున్న రక్ష ఆకాడమీలో 15 నిమిషాలు విరామం తీసుకుంటారు. సాయంత్రం ఏడున్నర గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకు ఆర్‌అండ్‌బి అతిథిగృహం చేరకుంటారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 9:15 గంటలకు అతిథిగృహం నుంచి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకు అక్కడికి చేరుకుంటారు. గౌరవ వందనం అనంతరం శ్రీకృష్ణదేరాయ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇంజనీరింగు కళాశాల భవనం, ఇంజనీరింగు కళాశాల వసతిగృహం, ఇంక్యూబేషన్‌ కేంద్రానికి కొత్తగా వేసిన రహదారిని ప్రారంభిస్తారు. ఇవి పూర్తయిన తరువాత ఉదయం 10 :30 గంటలకు స్నాతకోత్సవం జరుగుతున్న భువన విజయం ఆడిటోరియంలోకి ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఈ కార్యక్రమం ముగిస్తుంది. మధ్యాహ్నం 1:15 వరకు గంటపాటు భోజన విరామం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహం చేరుకుంటారు. మధ్యాహ్నం 2:55 గంటలకు అతిథిగృహం నుంచి బయలుదేరి మూడు గంటలకు విజయనగర లా కళాశాలకు చేరుకుంటారు. అక్కడ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బెంగళూరుకు రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణమై వెళతారు.