Oct 03,2023 22:27

జెసిబితో ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు

           ప్రజాశక్తి-నార్పల    భారీ పోలీసు బందోబస్తు మధ్య మండల కేంద్రంలోని పాత బస్టాండు, కుతలేరు వంక సమీపంలోని ఆక్రమణలను అధికారులు మంగళవారం తొలగించారు. గత కొన్నేళ్లుగా కుతలేరు నూతన వంతెన నిర్మాణం ఆగిపోయిన విషయం తెలిసిందే. వంతెన నిర్మాణం ముందుకు సాగాలంటే ఆక్రమణలు తొలగిపోవాలని అధికారులు చెబుతూ వస్తున్నారు. అయినా ఎవరూ వినకపోవడంతో మంగళవారం ఉదయం భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య బస్టాండ్‌లోని పలు ఆక్రమణలను తొలగించారు. అయితే బస్టాండ్‌ ఆవరణలో ఉన్న పురాతన కొల్లపురమ్మ ఆలయాన్ని తొలగిస్తున్నారని ప్రచారం సాగడంతో గ్రామస్తులు భారీఎత్తున తరలివచ్చారు. అయితే కేవలం ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని, ఆలయాన్ని తొలగించడమని తహశీల్దార్‌ హరికుమార్‌, ఎంపిడిఒ దివాకర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలియజేయడంతో చాలామంది వెనక్కి వెళ్లారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ అస్రార్‌బాషా, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ సురేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి అశ్వర్థనాయుడు, అధికారులు నాగరాజు, రామకృష్ణ, వెంకటేశు, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.