Mar 24,2023 20:56

samkustapana chestunna mantri kakani govardhan reddy

నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించటమే లక్ష్యం
రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి
ప్రజాశక్తి-గన్నవరం
రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను అందించటమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లా మండల కేంద్రమైన గన్నవరం ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనే ఉన్న విత్తనాభివద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో రూ.46 కోట్లతో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వైఎస్సార్‌ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రానికి కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆర్‌కె రోజా, గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ తదితరులతో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభకు వల్లభనేని వంశీమోహన్‌ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కాకాని గోవర్థనరెడ్డి మాట్లాడారు. దేశంలో జాతీయ స్థాయిలో వారణాసిలో మాత్రమే జాతీయ విత్తన పరిశోధన కేంద్రం ఉందని, మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సంకల్పించడం రైతు సంక్షేమానికి ఆయనకున్న చిత్తశుద్ధిని సూచిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయపరమైన సూచనలు, సలహాలు అందిస్తూ వారికి సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్‌బికెలు, అన్ని నియోజకవర్గాల్లో అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. విత్తనం మంచిదైతే మంచి దిగుబడి వస్తుందన్నారు. అందువల్ల ప్రధానంగా విత్తనంపై దృష్టి పెట్టామన్నారు. ఆర్‌బికెలలో ఉన్న వ్యవసాయ, మత్స్య సహాయకులకు విత్తన పరిశోధనపై తగిన శిక్షణ ఇస్తామన్నారు. జన్యుపరమైన, డీఎన్‌ఏ టెస్టులు కూడా నిర్వహిస్తారన్నారు. ఈ శిక్షణలు రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఎంతో ప్రయోజనకరమన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశోధన కేంద్రాన్ని ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం వి ఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి శేఖర్‌ బాబు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ జె.రాఘవరావు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.