నాణ్యమైన విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
ప్రజాశక్తి-చల్లపల్లి
విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో పాటు నాణ్యమైన విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న నిమ్మగడ్డ ప్రాథమిక పాఠశాల టీచర్లు నియోజకవర్గంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. చల్లపల్లి మండలం నిమ్మగడ్డ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడిలు లేకుండా, సమాజంలో ఆటుపోట్లను ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పాఠశాల వార్షికోత్సవ ఖర్చుల నిమిత్తం తన వంతు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే రూ.5000 పాఠశాల హెచ్‌ఎంకు అందజేశారు. అభిమానులు తన కార్యాలయానికి అందజేసిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. 5వ తరగతి చిన్నారి పల్లికొండ కీర్తన ఆంగ్లంలో ప్రసంగం ఇవ్వటంతో అభినందించారు. చదువు, ఆటపాటల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. టీచర్లను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. హెచ్‌ఎం కేఎస్ విఎన్ లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ కె.రాజకుమార్, విశ్రాంత ఎంఇఒ వి.మురళీకృష్ణ, సిఐ బి.రవికుమార్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు,సర్పంచ్ ఎం.రమ్య, గ్రామ ప్రముఖులు చిన్నం కోటేశ్వరరావు, అమరవాణి, సిఆర్‌పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










