Sep 05,2023 23:43

నూతన ఎస్పీ అన్బురాజన్‌

            అనంతపురం ప్రతినిధి : నాలుగు నెలలు తిరగక్కుండానే అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 25వ తేదీన ఆయన అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. ఇంకా ఆయన ఈ జిల్లా పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేలోపై బదిలీ అయ్యారు. ఏ కారణాలతో ఆయన్ను ఇంత త్వరగా బదిలీ చేసారారన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. వచ్చిన ఈ తక్కువ సమయంలో ఆయన మొదటి సొంత శాఖపైనే దృష్టి సారించినట్టు కనిపించారు. సిబ్బందిని చక్కబెట్టుకునే పనిలో నిమగమయ్యారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశాలూ ఉన్న సమయంలో ఎక్కడా ఎటువంటి సమస్య జిల్లాలో తలెత్తకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా సిబ్బందితో పనిచేయించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు కనిపించారు. ఇంకా అంత పెద్దగా రాజకీయపరంగానూ ఇబ్బందులు కల్పించిన దాఖలాలు లేవు. ఈ ఆలోపే కె.శ్రీనివాసరావును ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖపట్నం డిప్యూటీ కమిషర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిసిపి)గా నియమిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అన్బురాజన్‌ను అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించింది.
అన్బురాజన్‌ కోసమే కె.శ్రీనివాసర్‌రావును మార్చారా..!
కడప జిల్లా ఎస్పీగానున్న కెకెఎన్‌ అన్బురాజన్‌కు నాలుగు ఏళ్లలో పదవీకాలం పూర్తవుతోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను కడప జిల్లా ఎస్పీగా నియమించారు. ఆయన అక్కడ 2019 అక్టోబర్‌ 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లు పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి బదిలీ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈయన్ను అనంతపురం జిల్లా ఎస్పీగా బదిలీ చేసి ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా తమిళనాడుకు చెందిన కెకెఎన్‌.అన్బురాజన్‌ 2011కు సంబంధించిన ఐపిఎస్‌ అధికారి. మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం ఎంటెక్‌ పూర్తి చేసిన అన్బురాజన్‌ కొంతకాలం టిసిఎస్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. ఆ తరువాత సివిల్స్‌కు ప్రిపేర్‌ అయి ఐపిఎస్‌ అయ్యారు. 2011 బ్యాచ్‌లో ఐపిఎస్‌ పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. మొదట గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. చిత్తూరు అదనపు ఎస్పీగానూ, తూర్పుగోదావరి అదనపు ఎస్పీగానూ పనిచేశారు. 2013 నుంచి 2017 వరకు కడప అదనపు ఎస్పీగానూ, పనిచేశారు. 2018లో తిరుపతి అర్బన్‌ ఎస్పీగా పనిచేశారు. అనంతరం వైసిపి ప్రభుత్వం అధికాంరలోకి వచ్చాక కడప ఎస్పీగా 2019 అక్టోబరులో వచ్చారు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అనంతపురం ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన సర్వీసులో అత్యధికం రాయలసీమ జిల్లాల్లోనే పనిచేసినందుకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహనుండనుంది.