Oct 22,2023 08:24
  •  వృద్ధురాలి అనుమానాస్పద మృతిలో విస్తుపోయే విషయాలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : దత్త తీసుకున్న కూతురే తల్లిని హత్య చేసేందుకు సూత్రధారిగా మారిన సంఘటన రాజమహేంద్రవరం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి డిఎస్‌పి కె.విజయపాల్‌ మీడియాకు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 18న స్థానిక కంబాలపేటకు చెందిన సిద్ధబత్తుల మార్గరెట్‌ జూలియానా (63) అనుమానాస్పదంగా మృతి చెందారు. సీతానగరం మండలానికి చెందిన మృతురాలి సోదరుడు కాటి అజరయ్య ఫిర్యాదుతో త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జులియా, నాగేశ్వరరావు దంపతులకు పిల్లలు లేకపోవడంతో 13 ఏళ్ల క్రితం ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఎఫ్‌సిఐలో మేనేజర్‌గా పని చేసి రిటైరైన నాగేశ్వరరావు గతేడాది మృతి చెందారు. జూలియా టీచరుగా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. భర్త చనిపోవడంతో కంబాలపేటలోని సొంతింటిలో తల్లీ కూతుళ్లు కలిసి నివాసం ఉంటున్నారు. ఆ బాలిక ఇటీవల గార ఆకాష్‌తో ప్రేమలో పడినట్టు తల్లి గమనించింది. దీంతో, బాలికను మందలించింది. తన స్వేచ్ఛకు ఆమె వస్తోందని భావించిన దత్త కూతురు తల్లిపై ద్వేషం పెంచుకుంది. ఈ నెల 17న సాయంత్రం 7:30 గంటలకు మార్గరెట్‌ జూలియా ప్రమాదవశాత్తు కాలుజారి బాత్రూంలో పడిపోయింది. గాయం తగలడంతో ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటోంది. ఇదే అవకాశంగా భావించిన ఆ బాలిక తన ప్రేమికుడైన ఆకాష్‌కు సమాచారం అందించింది. తన తల్లిని అంతముందిస్తే రూ.కోట్ల ఆస్తి సొంతం చేసుకోవచ్చని భావించింది. దీంతో, ఒక పథకం ప్రకారం ఆకాష్‌, ఆయన స్నేహితులు అక్షరు కుమార్‌, దినేష్‌ రాయి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంటిలోకి ప్రవేశించారు. జూలియా నిద్రపోతుండగా ఆమె కాళ్లను దినేష్‌ రాయి, చేతులను అక్షరు కుమార్‌ పట్టుకున్నారు. ఆమెను ముఖంపై బాలిక, ఆకాశ్‌ అక్కడున్న క్లాత్‌తో నొక్కి ఊపిరి ఆడకుండా హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందని డిఎస్‌పి తెలిపారు. నిందితులు నలుగురినీ శనివారం గామన్‌ వంతెన వద్ద అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్‌ వద్ద హాజరు పరచగా రిమాండ్‌ విధించినట్టు చెప్పారు.