Oct 06,2023 14:20

ప్రజాశక్తి-ఏలూరు : మున్సిపల్ స్కూల్ స్వీపర్లకు రావలసిన బకాయి జీతాల కోసం చేస్తున్న ఆందోళనకు తమ ఏపీఎన్జీవో అసోసియేషన్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చోడగిరి శ్రీనివాసరావు, నెర్సు రామారావులు తెలిపారు. నేడు నాలుగో రోజు రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. దీక్షలో కూర్చున్న వారికి మెడలో రిబ్బన్లు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుద్యోగుల జీతభత్యాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, జీతాలు చెల్లింపుకు చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. ప్రభుత్వం మున్సిపల్  పాఠశాలలను విద్యాశాఖకు బదిలీ చేసి 15 మాసాలవుతున్నా జీతాల సమస్యపై చర్యలు చేపట్టక పోవడం బాధాకరమని అన్నారు. ఆందోళనకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మరియు జెఏసి కమిటీల ఆధ్వర్యంలో తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తామని, రాష్ట్ర సెక్రటేరియట్లో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఇంకా వీరితోపాటు తాలూకా అసోసియేషన్ నాయకులు మోహన్ రావు  కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. నాలుగో రోజు రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని డిఇఓ కార్యాలయం వద్ద వారు నేడు ప్రారంభించి మాట్లాడారు. రిలే దీక్షలు కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షురాలు జె.స్వాతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు లావేటి కృష్ణారావు, బంగారు వెంకటేశ్వరరావు, తానంకి జార్జి తదితరులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి లక్ష్మి ,సుజాత,పద్మజ, చిన్ని, ఆంథోని, భాస్కర రావు,చిట్టెమ్మ, హఫీజ్ ఉన్నిసా, యాస్మిన్ తదితరులు నాయకత్వం వహించారు.