Sep 30,2023 21:54
  • ఎల్‌నినో ప్రభావాన్ని తుడిచిపెట్టిన సానుకూల అంశాలు

న్యూఢిల్లీ : నాలుగు మాసాల వర్షాకాలం ముగిసింది. భారత్‌లో దీర్ఘకాల సగటైన 868.6 మిల్లీమీటర్లుగా వుండగా, ఈ ఏడాది సాధారణ వర్షపాతం 820 మిల్లిమీటర్లుగా నమోదైంది. ఎల్‌నినో పరిస్థితులు తలెత్తే ప్రమాదం వుందని తొలుత అంచనా వేసినా, కొన్ని సానుకూల అంశాలతో అది తుడిచిపెట్టుకుపోయిందని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది.
దీర్ఘకాల సగటులో 94 నుండి 106శాతం వర్షపాతాన్ని సాధారణమైనదిగా పరిగణిస్తారు. రుతుపవనాల సమయంలో దేశవ్యాప్తంగా సాధారణ సంచిత (క్యుములేటివ్‌) వర్షపాతం అంటే ప్రాదేశిక, తాత్కాలిక వర్షపాతం కాదు.
వివిధ ప్రాకృతిక కారణాల వల్ల తలెత్తే అంతర్లీన ఒడిదుడుకులు, మార్పులనేవి భారతీయ రుతుపవనాల్లో సర్వసాధారణంగా వుంటాయి. దీన్నే ప్రకృతి వైవిధ్యత అంటారు. వాతావరణ మార్పులు వర్షపాతాన్ని మరింత వైవిధ్యంగా తయారుచేస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. వైవిధ్యత పెరిగిన కొద్దీ మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పొడి వాతావరణం నెలకొంటాయి.
కొన్ని సానుకూల అంశాలు ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనడంతో 2023 వర్షాకాలంలో మొత్తంగా 94.4శాతం వర్షపాతం నమోదైందని ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర శనివారం పత్రికా సమావేశంలో తెలిపారు. 73శాతం ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 18శాతం ప్రాంతాల్లో అరకొరగా వర్షపాతం నమోదైందని చెప్పారు. వాయవ్య భారతంలో దీర్ఘకాల సగటు 587.6మి.మీ వుండగా, 593మి.మీ నమోదైంది. ఇక వర్షాలపైనే ప్రధానంగా వ్యవసాయం ఆధారపడే మధ్య భారతంలో సాధారణం 978మి.మీ కాగా, 981మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణ ద్వీపకల్పంలో 8శాతం లోటు వర్షపాతం నమోదైంది.