Sep 27,2023 11:08

ఇంఫాల్‌ :   మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. మణిపూర్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ డేటా సేవల ఇంటర్నెట్‌/డేటా సేవల తాత్కాలిక సస్పెన్షన్‌/నియంత్రణ మంగళవారం సాయంత్రం నుండి అక్టోబర్‌ 1వ తేదీ రాత్రి 7:45 గంటల వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు రోజుల క్రితం ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.

జులై 6 న అదృశ్యమైన  ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలకు  సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. వారి  హత్యను నిరసిస్తూ.. మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం, లాఠీచార్జి చేయడంతో 40 మంది గాయపడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలపై మరోసారి తాత్కాలిక నిషేధం విధించింది.