- ఆకలి బాధకు భిక్షాటనే శరణ్యం అంటూ ఆవేదన
ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : ఆకలి బాధకు భిక్షాటనే శరణ్యం అంటూ జిల్లా సర్వోజన ఆస్పత్రిలోని వైద్య ఉద్యోగులు, సిబ్బంది సోమవారం ఆందోళన బాట పట్టారు. 6 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిని సర్వోజన జిల్లా ఆస్పత్రిగా మార్పు చేసిన నుండి వైద్య ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు అందలేదన్నారు. ఉన్నతాధికారుల నిరంకుశత్వం వల్లే జీతాలు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల నుండి నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సమస్యను పరిష్కరించి జీతాలు అందించాలని కోరారు. జీతాల సమస్య పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










