ప్రజాశక్తి - మడకశిర : మండల పరిధిలోని చందకచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ శుద్ధజల కేంద్రం మూతపడింది. దీంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2014లో టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ శుద్ధ జల కేంద్రం ద్వారా రూ.2కే 20 లీటర్ల శుద్ధ జలాన్ని ప్రజలకు అందించేవారు. ప్రారంభంలో మిత్ర సంస్థ ఈ కేంద్రాన్ని నిర్వహించింది. తర్వాత ప్రభుత్వం నుంచి పంచాయతీలకు సక్రమంగా నిధులు అందకపోవడం, వచ్చిన నిధులను ఇతర వాటికి మళ్లించడంతో శుద్ధ జల కేంద్రం నిర్వహణ, మరమ్మతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రజలు ప్రయివేట్ ట్యాంకర్ వద్ద రూ. 10 చెల్లించి శుద్ధ జలాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది గ్రామ ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు కొళాయి నీటినే తాగుతున్నారు. ఇకనైనా అధికారులు శుద్ధజల కేంద్రాన్ని తెరిపించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.










