Oct 08,2023 21:44

గుమ్మలక్ష్మీపురంలో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్లు మూడేళ్లుగా మూతపడ్డాయి. దీంతో ఒకవైపు ప్రభుత్వ లక్ష్యం నీరుకారగా, మరోవైపు యువతకు ఉపాధి శిక్షణ కరువైంది. ఇందులో పనిచేస్తున్న సిబ్బందికి నెలలు తరబడి వేతనాలందక ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన వైటిసి కేంద్రాలు ఉపాధి శిక్షణ లేక వెలవెలబోతున్నాయి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం, సీతంపేటలో గిరిజన నిరుద్యోగ యువతకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వైటిసిలను ఏర్పాటు చేశారు. వైటిసిల నిర్వహణ, అందులో పని చేస్తున్న ఉద్యోగుల జీతాల కోసం ట్రైకార్‌ నిధులను వినియోగించేవారు. 2017 నుంచి 2019 వరకు ఎంతోమంది నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు కంప్యూటర్‌, టైలరింగ్‌, డ్రెస్‌ మేకింగ్‌, డ్రైవింగ్‌ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేవారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు రోజుకు రూ.160 చొప్పున సమకూర్చేవారు. రెండు నెలల కాలం శిక్షణ ఉండేది. శిక్షణ నిర్వాహణలకు రూ.10వేలు చొప్పున వేతనం చెల్లించేవారు. శిక్షణ కోసం కంప్యూటర్లు, కుట్టు మిషన్లు సమకూర్చారు. ఇక్కడ శిక్షణ పొందిన పలువురు యువత హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లి స్థిరపడ్డారు.
మూడేళ్లగా మూత
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు వైటిసిల నిర్వహణ సక్రమంగా సాగింది. అయితే కరోనా మహమ్మారి రావడంతో శిక్షణ నిలిపివేశారు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టినా శిక్షణా కేంద్రం తిరిగి ప్రారంభించలేదు. మూడేళ్లుగా ఉపాధి శిక్షణ లేక నిరుద్యోగ గిరిజన యువత నిరాశలో ఉన్నారు. పార్వతీపురం వైటిసిలో ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేశారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు వైటిసిల్లో గిరిజన గర్భిణీల వసతి గృహాన్ని ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారు. అయితే గిరిజన యువతకు ఉపాధి శిక్షణ లేకపోవడంతో వలసలు వెళ్లిపోతున్న పరిస్థితి.
ఉపాధి శిక్షణ ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం వైటిసిలను తిరిగి ప్రారంభించే గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధిలో శిక్షణ ఇవ్వాలి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో వందలాదిమంది గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారు. శిక్షణ పొందడం ద్వారా వీరికి ఉపాధికి అవకాశం ఉంటుంది.
- తోయక హరిబాబు
గిరిజన నిరుద్యోగి
వలసలు వెళ్లిపోతున్నారు
వైటిసిలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో శిక్షణ కరువైంది. గిరిజన ప్రాంతంలో యువత ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్న పరిస్థితి. గిరిజన యువతకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది.
- కోలక అవినాష్‌,
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి
నిధులు కేటాయించాలి...
వైటిసిల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఉపాధి శిక్షణ అందించాలి. నిధుల్లేక ఉపాధి శిక్షణ మరుగున పడింది. పదో తరగతి, ఇంటర్‌ చదువుకున్న ఉపాధి అవకాశాలు లేవు. ప్రభుత్వం స్పందించాలి.
- పాడి సుదర్శన్‌ రావు
టిడిపి మండల కన్వీనర్‌