Aug 07,2023 19:45

రోడ్డుపై పారుతున్న మురుగునీరు

ప్రజాశక్తి - కోసిగి
మండలంలోని జంపాపురం గ్రామంలో రోడ్లపై మురుగునీరు నిలుస్తుండడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. జంపాపురం నుంచి ఐరన్‌గల్‌ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై తాగునీటి ట్యాంకు పైపులైన్‌ లీకేజీ అవుతోంది. నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీనికి తోడు రోడ్డుకిరువైపులా సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు, అటుగా వెళ్లే వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు సోకే అవకాశం ఉందని, రోడ్డుపై నిలిచి ఉన్న మురుగునీటితో ఎలాంటి రోగాలు వస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మురుగునీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.