Jun 01,2023 10:32

హిందూపురంలో జీపుజాతాను జెండా ఊపి ప్రారంభిస్తున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి

     హిందూపురం: మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా, పనిభారంతో ప్రభుత్వాలు వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని, మున్సిపల్‌ ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, పాదయాత్ర, ఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర స్థాయి జీపుజాతా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో బుధవారం ప్రారంభం అయ్యింది. జాతాను ధనలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు హిందూపురం, పెనుకొండ, పట్టపర్తి, ధర్మవరం మీదుగా అనంతపురం చేరుకుంది. జాతా ప్రారంభం సందర్భంగా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జగదీష్‌ అధ్యక్షతన బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, రాష్ట్ర నాయకులు ముత్యాలరావు, నాగేంద్ర కుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జడ్పీ శ్రీనివాసులు, ఈఎస్‌.వెంకటేష్‌, అనంత జిల్లా నాయకులు ఏటీఎం నాగరాజు, ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 123 కార్పొరేషన్‌, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో దాదాపు 40 వేల మందికి పైగా కాంట్రాక్ట్‌ అవుటోసోర్సింగ్‌ కార్మికులు, పదివేల మందికి పైగా సిపిఎస్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరందరికీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికలు, అంతకు మునుపు జరిగిన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినప్పటికీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. అవుట్‌సోర్సింగ్‌ రద్దు, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. మున్సిపల్‌ కార్మికులు పనిచేసేందుకు అవసరమైన పనిముట్లను సైతం ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. పెరిగిన పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచడం లేదన్నారు. ప్రభుతవం ఈ సమస్యలపై స్పందించాలన్నారు. కార్మికులందరికీ 010 పద్దు ద్వారా జీతాలివ్వాలన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలన్నారు. సిపిఎస్‌ను రద్దు చేసి, ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు హెల్త్‌, రిస్క్‌ అలవెన్స్‌, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఈ హామీలను అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కార్మికుల కోసం చేపట్టిన జాపుజాతా హిందూపురంలో బయళ్దేరి ఈనెల 9వ తేదీన విజయవాడకు చేరుకుంటుందన్నారు. జూన్‌ 9వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్మికులతో కలిసి విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు ఆనంద్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ప్రవీణ్‌ కుమార్‌, మల్లికార్జున, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.