Jul 12,2023 22:17

సమావేశంలో మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపల్‌ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్‌ చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని సాయి ఆరామం అతిథిగృహంలో ఆ సంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు మారుతున్నా మున్సిపల్‌ కార్మికుల తలరాతలు మారలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మొండి చేయి చూపుతున్నారన్నారు. మున్సిపల్‌ కార్మికులు వారం రోజులు పని మానేస్తే పట్టణాలు కంపుకొడతాయన్నారు. కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న కార్మికులను చంద్రబాబు పాలనలో అవుట్‌ సోర్సింగ్‌ విధానం తెచ్చాడన్నారు. దీంతో జగన్‌ అధికారంలోకి వచ్చి కార్మికులను ఉద్యోగులుగా మార్చుతానని హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులు అని పేరు పెట్టి సంక్షేమ పథకాలను రద్దు చేశాడన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల కార్మికులు నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ కార్మికుల పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు జగదీష్‌, సిఐటియు నాయకులు పైపల్లి గంగాధర్‌, బాబావలి, కార్మిక సంఘం నాయకులు పెద్దన్న, రామయ్య, నాగార్జున, వెంకటలక్ష్మి, రామాంజనమ్మ, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని నాయకులు పాల్గొన్నారు.