Oct 04,2023 21:53

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
          జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో నాలుగు వేల మునగ మొక్కలను నాటుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. బుధవారం బుట్టాయగూడెంలోని అంగన్వాడీ కేంద్రంలో మునగ మొక్కలను కలెక్టర్‌ నాటి జిల్లాలో నాలుగు వేల మునగ చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగ చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా విశ్లేషించారన్నారు. మునగలో విటమిన్‌ సి, మాంసకృతులు, ఐరన్‌, పొటాషియం అధికంగా ఉంటాయన్నారు. మునగ ఆకులు రక్తహీనతను నివారించడంతోపాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నారు. ఈ మొక్కలను పాఠశాలల్లో పెంచి సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మునగాకుల వినియోగంతో అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, మహిళలు, పిల్లలు, తమ పాఠశాలల్లోని విద్యార్థులకు రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని తొలగించొచ్చన్నారు. మునగ చెట్టుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో నాటాలని నిర్ణయించామన్నారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌
బుట్టాయగూడెం-5 అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సందర్శించారు. అక్కడున్న గర్భిణి కోసూరి స్వప్న ఆరోగ్యం గురించి వాకబు చేశారు. రక్తహీనత గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు సంబంధించిన బట్టలు, బ్యాగ్స్‌, బ్యాడ్జీలను అందజేశారు. కలెక్టర్‌ వెంట ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శర్మిష్ట, ఐసిడిఎస్‌ పీడీ విజయలక్ష్మి, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్‌, డిఇఒ శ్యామ్‌సుందర్‌, తహశీల్దార్‌ ఎస్‌ఎస్‌.శాంతి, ఎంపిడిఒ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.
జూనియర్‌ కళాశాల సందర్శన
బుట్టాయగూడెం జూనియర్‌ కళాశాలను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులను కలిసి రక్తహీనత, పౌష్టికాహార లోపం గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాల హాస్టల్‌లో మరో 150 మందికి అదనపు వసతికి డార్మెటరీ నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజను ఆదేశించారు. అక్కడే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తరగతులను కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులను శిక్షణ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంఎస్‌ వర్డ్‌, ఎక్సెల్‌ క్యాలిక్యులేట్‌, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో అవగాహన పొందాలన్నారు. ఎంఎస్‌ ఆఫీసు ఎక్కడికి వెళ్లినా ఉపయోగపడుతుందని తెలుపుతూ తాను ఇంటర్‌ చదువుతున్న సమయంలో ఎంఎస్‌ ఆఫీసు నేర్చుకున్నానని, అది ఇప్పటికీ కూడా తనకెంతో ఉపయోగపడుతుందని అన్నారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, అసిస్టెంట్‌ ట్రెయినీ కలెక్టర్‌ శ్రీపూజ, ఆర్‌డిఒ ఝాన్సీరాణి, డిఇఒ శ్యామ్‌ సుందర్‌, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్‌, తహశీల్దార్‌ ఎస్‌ఎస్‌.శాంతి, ఎంపిడిఒ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.