గుమ్మలక్ష్మీపురం : వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ పాఠశాల వరద నీటితో పూర్తిగా మునిగిపోతుంది. దీంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదేళ్ల నుంచి ఇదే సమస్య ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... జియమ్మవలస మండలం నిర్వాసిత గ్రామమైన బాసంగిలో గల ఎంపిపి పాఠశాల వర్షాకాలం వచ్చిందంటే చాలు నీటితో పూర్తిగా ముంపుకు గురవుతోంది. దీంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు గ్రామంలో ఉన్న ఇళ్ల వద్ద తరగతులను నిర్వహించాల్సి వస్తోంది. నీటి ప్రవాహానికి పాములు, విష కీటకాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటి ఒడ్డున పాఠశాల ఉండడంతో ప్రతి ఏటా ముంపునకు గురి కావడంతో, తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపడానికి ఇష్టపడడం లేదని, విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.










