Jul 09,2023 21:07

పొలం దున్నుతున్న రైతు

ముందుకు సాగని 'సాగు'
- ఆత్మకూరు డివిజన్‌లో ఇపట్పి వరకు 11.09 శాతమే..
- మొత్తం 78,272 ఎకరాలు సాగు భూమి
- కేవలం 8683 ఎకరాల్లోనే విత్తనం
- వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

      ఆత్మకూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలో పంటల సాగు సాగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సకాలంలో వర్షాలు పడకపోవడమే. ఆత్మకూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలో ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లి మండలాలలో ఈ ఖరీఫ్‌ సీజన్లో రైతులు ఇప్పటివరకు 60 శాతం మేర విత్తనాలు వేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 11.09 శాతం మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. వర్షాలు పడినా కుండపోతగా కురవడంతో వ్యవసాయానికి అనువుగా లేక సకాలంలో విత్తనాలు వేయడం లేదు.
       ఆత్మకూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలో 78,272 ఎకరాలలో పంట సాగు విస్తీర్ణం ఉంది. ఇప్పటి వరకు 8683 ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న పంట 7372 ఎకరాల్లో వేశారు. పత్తి పంటను 752 ఎకరాల్లో సాగు చేశారు. ఆత్మకూరు మండలంలో మొక్కజొన్న పంట 11,450 ఎకరాల్లో వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 4660 ఎకరాల్లో వేశారు. ఇందులో బావుల కింద 2657 ఎకరాలు, చెరువుల కింద 127 ఎకరాలు, వర్షంపై ఆధారపడి 1875 ఎకరాల్లో రైతులు వేశారు. వెలుగోడు మండలంలో ఇంతవరకు ఒక ఎకరాలో కూడా విత్తనాన్ని రైతులు వెయ్యలేదు. పాములపాడు మండలంలో మొక్కజొన్న పంట 15,707 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1282 ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న పంటను వేశారు. కొత్తపల్లి మండలంలో 9627 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1430 ఎకరాలలో మాత్రమే వేశారు. మరో ప్రధాన పంటగా ఉన్న వరి డివిజన్‌ పరిధిలో మొత్తం 19,722 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 87 ఎకరాల్లో మాత్రమే రైతులు వేశారు. అలాగే పత్తి పంట 9577 ఎకరాల్లో వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 752 ఎకరాల్లో మాత్రమే వేశారు. ఆత్మకూర్‌ వ్యవసాయ డివిజన్‌ పరిధిలో వర్షం ఏప్రిల్‌, మే నెలలో అనుకున్న స్థాయికి నమోదయింది. జూన్‌లో 87.5 మి.మీ వర్షపాతానికి గాను 47.9 మి.మీ వర్షం కురిసింది. జులైలో ఇప్పటి వరకు 173.0 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 111.8 మి.మీ నమోదయింది. ఈ వర్షం కూడా రెండు రోజులపాటు ఆత్మకూరు డివిజన్‌లో పడింది. సాధారణంగా జూలై 15వ లోపు రైతులు తమ వ్యవసాయ భూముల్లో పూర్తిస్థాయిలో పంటలు వేసే సంప్రదాయం ఉన్నప్పటికీ ఇప్పటివరకు డివిజన్లో వర్షాభావంతో 11.09 శాతం మాత్రమే సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌ సీజన్లో రైతులు ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో వేసిన పంటలను వర్షం లేక చెడగొట్టారు. ఇటీవల భారీ స్థాయిలో కురిసిన వర్షపు నీరు పంట పొలాల్లో నిలిచిపోవడంతో మొలకెత్తిన మొక్కలు కూడా ఎర్రబడ్డాయి. వీటిని రైతులు చెడగొట్టి మరోసారి విత్తనాలు వేసుకోవలసిన పరిస్థితి ఉంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణం అనుకూలించేనా, వర్షాలు పడేనా అని విత్తనాలు వేసిన రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.