ముందస్తుతో కేన్సర్ నివారణ
ప్రజాశక్తి-కావలి : కేన్సర్‌ను ముందే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని, ప్రాణాపాయం తప్పుతుందని నెల్లూరు రెడ్‌క్రాస్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారిణి డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. శ్రీసాయి డిగ్రీ కళాశాలలో శుక్రవారం కావలి రెడ్‌క్రాస్ సహకారంతో కేన్సర్ వ్యాధిపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి ''శ్రవణ, దృశ్య మాద్యమం ద్వారా కేన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత మూడు దశాబ్ధాలలో ప్రజల జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో జరిగిన పెను మార్పుల కారణంగా కేన్సర్ వ్యాధి బాధితులు పెరిగారన్నారు. దూమపానం, పొగాకు వినియోగం వల్ల వచ్చే కేన్సర్ దుష్ఫలితాల వీడియోలను ప్రదర్శించారు. స్వీయ పరీక్షల ద్వారా కేన్సర్ వ్యాధిని గుర్తించడం వివరించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్, మాజీ మున్సిపల్ చైర్మన్ నగళ్ల శ్రీనివాసకిరణ్, ప్రిన్సిపాల్ షేక్ బీబావలి, అధ్యాపకులు డాక్టర్ ఎం సాంబశివయ్య పాల్గొన్నారు.










