Sep 11,2023 20:39

పిఒపి విగ్రహాలకే ఎక్కువ డిమాండ్‌
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   వినాయక చవితి పండుగ నేపథ్యంలో పలుచోట్ల గణేష్‌ విగ్రహాలు అమ్మకానికి సిద్ధమయ్యాయి. పట్టణంలోని జెపి సెంటర్‌ మైదాన ప్రాంతంలో గణేష్‌ విగ్రహాలను అధిక సంఖ్యలో సిద్ధం చేశారు. గతంలో గణేష్‌ విగ్రహాలను తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకునేవారు. కానీ దీనికి భిన్నంగా జంగారెడ్డిగూడెంలో అధిక సంఖ్యలో విగ్రహాలు తయారవడంతో వ్యాపారస్తులు పండుగలకు అవసరమైన పిఒపి విగ్రహాలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాల కంటే రసాయనాలతో తయారయ్యే పిఒపి విగ్రహాలకే డిమాండ్‌ ఉంటుందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. భారీ సైజులో సిద్ధం చేసిన గణేష్‌ విగ్రహాలు రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకూ తమ వద్ద లభిస్తాయని స్థానిక వ్యాపారులు తెలియజేశారు. ఏదేమైనా వినాయక చవితి విగ్రహాలు ఈ ఏడాది ముందస్తుగానే సిద్ధం చేశారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.