ప్రజాశక్తి - పార్వతీపురం : జిల్లాలో ముమ్మరంగా ఓటరు పునశ్చరణ కార్యక్రమం చేస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శుక్ర వారం జిల్లా కలెక్టర్లతో ఓటరు పునశ్చరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి ఓటరు విచారణ చక్కగా సాగుతుందన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్తున్నారని, అన్ని అంశాలు నిర్దేశిత సమయం నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాలో 7,70,144 మంది ఓటర్లు ఉన్నారని, 8,255 మంది నమోదు కాని ఓటర్లను గుర్తించామని, 1457 డుప్లికేట్ ఓట్లు, 1529 మార్పు చెందిన (బదిలీ ఓటర్లు), 4288 మంది మృతి చెందిన ఓటర్లను గుర్తించామని వివరించారు. ఓటరు జాబితాలో అవసరం లేదని గుర్తించిన 8009 ఓట్లు గుర్తించామని, వీటిపై ఇప్పటికీ 7910 దరఖాస్తులు తీసుకున్నామని, 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలు 3727, వాటిలో 64,550 ఓట్లు ఉన్నట్లు గుర్తించి వాటిని పరిశీలించామని తెలిపారు. 34,607 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. వందేళ్లు దాటిన 71 మంది ఓటర్లను గుర్తించి విచారించామన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా దృష్టి సారించామని, ఆగస్టు 30 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ జె.వెంకటరావు పాల్గొన్నారు.










