సాలూరురూరల్: మండలం చుట్టూ నదులు ప్రవహిస్తున్నా ఈ ప్రాంత రైతాంగానికి సాగుకు చుక్క నీరందడంలేదు. దీంతో అనేక ఏళ్లుగా రైతులు సాగునీటి సౌకర్యం కోసం పాలకులకు పలుమార్లు విన్నపాలు విన్నవించుకోగా, ఎట్టకేలకు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు సాగుకు ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఈ ఎత్తిపోతల పథకం గత కొంత కాలంగా మరమ్మతులకు గురై పడకేసింది. ఇక రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మరమ్మతులు చేయాలని అధికారులను కోరగా, తమ వద్ద నిధుల్లేవని చేతులెత్తాశారు. దీంతో రైతు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇదీ మండలంలోని ఖరాసువలస పంచాయతీ దత్తివలస వద్ద గల బురాడమ్మ ఎత్తిపోతుల పథకం పరిస్థితి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని ఖరాసువలస ప్రాంత రైతులు ఎన్నో ఏళ్లుగా సకాలంలో వర్షాల్లేక సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతుండే వారు. తమ పరిస్థితిపై స్థానిక నాయకులకు, ప్రభుత్వానికి అనేకమార్లు రైతులు మొరపెట్టుకున్నారు. వీరి ఇబ్బందులను చూసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో సుమారు రూ.2కోట్ల 73లక్షలతో స్వర్ణముఖి నదీ ఒడ్డున మండలంలోని ఖరాసువలస పంచాయతీ దత్తివలస వద్ద బురాడమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సుమారు 330 ఎకరాలు వరకు సాగునీరందుతుంది. దీంతో సుమారు 250 మంది సన్న, చిన్న కారు రైతులు ఖరీఫ్ సీజన్లో వరి పంటకు ఇబ్బందులు లేకుండా సాగింది.. ఎత్తిపోతల పథకం నది ఒడ్డున ఉండడంతో ప్రతి ఏటా వరదలు, తుఫాన్ల వల్ల మోటార్లు, ఎలక్ట్రికల్ బోర్డులు మరమ్మతులకు గురయ్యేవి. రైతులు నీటి పన్నులను ఎకరాకు రూ.500 చొప్పున వేసుకొని వాటి మరమ్మతులకు, అందులో పనిచేసే సిబ్బందికి జీతాలకు సరిపోయేవి. కానీ వరి పంటకు గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉండడంతో పండించిన పంట పెట్టుబడులకే సరిపోతుండడంతో నీటి పన్నులు కూడా చెల్లించే పరిస్థితికి రైతులు వచ్చేశారు. దీంతో పథకం నిర్వహణా భారం అవ్వడం, ఇప్పుడు ఇది మరమ్మతులకు గురవ్వడంతో బాగు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో సాగునీటికి రైతులు నానా అవస్థలుపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పథకానికి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
మరమ్మతులు చేయాలి : రైతులు
నిధుల్లేవు : అధికారులు
ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టాలని ఎత్తి పోతల పథకం కన్వీనర్ బూస తవుడు, రైతులు రామారావు , శ్రీను, అప్పల నాయుడు, సింహాచలం, మాధవ, తవుడు ఎపిఐడిసి ఎఇ శ్రీనివాసరావును కోరారు. పథకాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తికావడంతో పుంపులు, ఎలక్ట్రికల్, పైపులు, రిటర్నింగ్ వాల్సు మొదలైనవి మరమ్మతులకు గురయ్యాయన్నారు. వీటి అన్నింటినీ పరిశీలించి ఎంత మొత్తంలో నిధులు అవసర ముందని, అంచనా వేసి అందులో రైతులు 25 శాతం వరకు నిధులు అందజేస్తే మిగతాది ప్రభుత్వం మంజూరు చేస్తుందని, దీని కోసంపై అధికారులకు నివేదిక పంపి మరమ్మతులు చేపడతామని ఎఇ తెలిపారు. అనంతరం ఎత్తి పోతల పథకం కన్వీనర్ బూస తవుడు మాట్లాడుతూ దీన్ని ప్రారంభించినప్పటి నుంచి కన్వీనర్‌గా తాను పనిచేస్తున్నానని, ఐదేళ్ల వరకు ఎటువంటి మరమ్మతులు రాలేదని, కానీ ప్రతి ఏటా వరదల వల్ల మోటార్లు, ఎలక్ట్రికల్ బోర్డులు రిపేర్ అవుతున్నాయని, ఇప్పుడు పూర్తిగా పంపులు రిపేర్లు కావడంతో రైతులు అంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలని కోరారు.










