Apr 27,2023 08:41

శ్రీ సత్యసాయి జిల్లా పోతులనాగేపల్లి లేఅవుట్‌ వద్ద ముఖ్యమంత్రి కాన్వారును అడ్డుకుంటున్న మోటుమర్ల, తుంపర్తి గ్రామ రైతులు

        ధర్మవరం టౌన్‌ : ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి నిర్వాసిత రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. నార్పలలో వసతిదీవెన కార్యక్రమం ముగిసిన అనంతరం హెలీప్యాడ్‌ మొరాయించడంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయళ్దేరారు. ఈ సమయంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం, ధర్మవరం మండల పరిధిలోని తుంపర్తి, మోటుమర్ల గ్రామ భూ నిర్వాసిత రైతులు తమకు పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేస్తూ సిఎం కాన్వారును పోతులనాగేపల్లి లేఅవుట్‌ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములను తీసుకుని నామమాత్రపు పరిహారం ఇచ్చారని, తమకు జరిగిన అన్యాయంపై సీఎంకు చెప్పుకునేందుకు వారు రోడ్డుపైకి వచ్చారు. ముఖ్యమంత్రి కాన్వారు రాగానే ఒక్కసారిగా బాదితులు తమకు న్యాయం చేయాలంటూ కాన్వారుకు అడ్డుగావెళ్లారు. వెంటనే సిఎం సెక్యూరిటీ సిబ్బంది నిరసన తెలుపుతున్న రైతులను పక్కకు నెట్టేశారు. అనంతరం కాన్వారు ముందుకు వెళ్లిపోయింది. రైతులు ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించకుండా వెళ్లిపోయారు. కాన్వారు వెళ్లిన తరువాత బాధిత మహిళా రైతులు తిమ్మక్క, గంగమ్మలు రోడ్డుపై పొర్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.
పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారు..
బాధిత రైతులు

వైసిపి అధికారంలోకి వస్తే పరిహారం పెంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన నాయకులు అధికారంలోకి రాగానే దాని గురించి పట్టించుకోకుండా అన్యాయం చేశారంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాన్వారు వెళ్లిన తరువాత రైతులు వెంకట రాముడు, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, తిమ్మక్క తిమ్మక్క తదితరులు మాట్లాడుతూ గతంలో టిడిపి హయాంలో అప్పటి ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇళ్లస్థలాల కోసం మోటుమర్ల, తుంపర్తి గ్రామ పొలాలను భూ సేకరణ చేయించారన్నారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములను తీసుకుని ఎకరాకు రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. అప్పడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాము అధికారంలోకి వచ్చాక పరిహారం ఎక్కువ ఇప్పిస్తామని మాట ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవిద్దామంటే కనీసం పట్టించుకునే వారు కూడా ఎవరూ లేరన్నారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ, పోలీసులు నిర్ధాక్షిణ్యంగా తమను పక్కకు తోసేశారంటూ కన్నీటి పర్యవంతం అయ్యారు.