Apr 26,2023 22:39

స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడుతున్న సిఎం జగన్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సత్యసాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం అనంతపురం జిల్లా నార్పలలో జరిగే వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట బొత్స సత్యనారాయణ వచ్చారు. విమానాశ్రయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు, ఎస్‌పి మాధవరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి, మాలగుండ్ల శంకర్‌ నారాయణ, తిప్పే స్వామి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకటరామిరెడ్డి, పివి సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్‌ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి షబ్బీర్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ, మున్సిపల్‌ చైర్మన్‌ తుంగ ఓబుళపతి, ఎంపీపీ ఎవి. రమణారెడ్డి, ఆర్‌డిఒ భాగ్యరేఖ, ఫుడా చైర్‌పర్సన్‌ లక్ష్మీ నరసమ్మ, తదితరులు ఉన్నారు. అనంతరం హెలికాప్టర్‌ లో ముఖ్యమంత్రి జగన్‌ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నార్పలకు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బత్తలపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రయాణించే హెలికాప్టర్లో తలెత్ని సాంకేతిక లోపం వల్ల ఆయన రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరారు. బహిరంగసభ అయిపోగానే ఇళ్లకు చేరుకున్న పార్టీ శ్రేణులకు ఈ సమాచారం అందింది. దీంతో అప్పటికప్పుడు క్షణాల్లో బత్తలపల్లి కూడలిలో ప్రజలు పెద్ద ఎత్తున జగన్‌ను చూడటానికి గుమికూడారు. బత్తలపల్లి పోలీసులు, ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసులు వాహనాలను ఎక్కడికక్కడ ఆపివేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కాన్వారు బత్తలపల్లికి చేరుకోగానే శివాలయం నుంచి కూడలి వరకు ప్రజలు ముఖ్యమంత్రికి అభివాదం చెప్పుకుంటూ కేరింతలు కొట్టారు. కూడలిలో విక్రయానికి తీసుకువచ్చిన కనకాంబరాలు, బంతి పూలను జగన్‌ వాహనాన్ని ముంచెత్తారు. కాన్వారు నుంచి సెక్యూరిటీ కిందకు దూకి ప్రజలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఈసందర్భంగా జగన్‌ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మండలంలోని మాల్యవంతం, బత్తలపల్లి, పోట్లమర్రి గ్రామాల్లో ప్రజలు రోడ్డుపైకి చేరుకుని జగన్‌ మద్దతుగా అభివాదం చేశారు. సీఎం కూడా ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఏపీ కురుబ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు, మండల కన్వీనర్‌ బగ్గరి బయపరెడ్డి, సచివాలయాల మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి, ఎంపీపీ గజ్జెల వెంగళరెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.