ప్రజాశక్తి - గుడివాడ : ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 16వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలం మల్లాయపాలెంలో 77.46 ఎకరాల్లో 8,912 టిడ్కో గహాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మంగళవారం గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ /ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలసీల రఘురాం, గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), జిల్లా ఎస్పీ పి. జాషువా, టిడ్కో ప్రాజెక్ట్ అధికారి చిన్నోడు, గుడివాడ ఆర్టీవో పద్మావతి, బందర్ ఆర్డీవో ఐ కిషోర్, మున్సిపల్ కమిషనర్ మురళీకష్ణ, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు. గుడివాడ మల్లాయపాలెం హెలిప్యాడ్, బహిరంగ సభ వద్ద పక్కా బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని గ్యాలరీల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించి అన్ని గ్యాలరీలలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వేసవి తీవ్రత వల్ల త్రాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత నివ్వాలని, అన్ని గ్యాలరీలలో ఓ ఆర్ ఎస్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో గహాల వద్ద లబ్ధిదారులు ఉండేలా చూడాలని అవసరమైతే సీఎం వారితో మాట్లాడే అవకాశం ఉందని ఎంపిక చేసిన టిడ్కో గహాల వద్ద లబ్ధిదారులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ పి. జాషువా మాట్లాడుతూ హెలిప్యాడ్ వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని, పోలీస్ బందోబస్తు సక్రమంగా ఉండి పలుచోట్ల తనిఖీలు ముమ్మరం చేయాలని ఎస్పీ సూచించారు. బహిరంగ సభ జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. 15వ తేదీ ఉదయానికి పోలీసులు తమకు కేటాయించిన విధులకు హాజరు కావాలన్నారు. బుధవారం సాయంత్రం ముందస్తు భద్రత సమన్వయ సమావేశం ఏ ఎస్ ఎల్ నిర్వహించడం జరుగుతుందని అధికారులు అందరూ హాజరు కావాలని అన్నారు. ఈ సమావేశంలో డిటిసి సీతాపతి రావు, డ్వామా పిడి, హౌసింగ్ పీడీ జివి సూర్యనారాయణ, డి ఆర్ డి ఎ పి డి. పి ఎస్ ఆర్ ప్రసాద్, ఆర్టీసీ డిఎం పెద్ది రాజులు, మున్సిపల్ సహాయ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.










