ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : అనంతపురం జిల్లా నార్పల మండలంలో నిర్వహించే విద్యా దీవెన పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రానున్న తరుణంలో పుట్టపర్తి విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టరు, ఎస్పీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ముఖ్యమంత్రి 26న ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానశ్రయానికి 9 : 45కు చేరుకుంటారు. ఇక్కడినుండి అనంతపురం జిల్లా నార్పల మండలం బాలుర హై స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకొనున్నారు. అక్కడ సభ ముగించుకొని మధ్యాహ్నం 1:10 నార్పలలో బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయానికి 1 :30 చేరుకుంటారు. పుట్టపర్తి విమానశ్రయం నుండి 1 : 30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం పుట్టపర్తి విమానాశ్రయంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కలసి పుట్టపర్తి విమానశ్రయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యశాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులెన్స్, సేఫ్ రూము ,ఫైర్ అధికారులు, ఫైర్ సేఫ్టీ చర్యలు ఫుడ్ సేఫ్టీ, తదితర శాఖలు తీసుకోవలసిన చర్లపై పలు సూచనలు చేశారు. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలని పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. కాన్వాయ అందుబాటులో ఉండే విధంగా వాహనాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని ట్రాన్స్‌పోర్టు అధికారికి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోప్ పార్టీ బందోబస్తు అంశాలపై పోలీసులకు సూచనలు చేశారు. ఎయిర్‌పోర్టు టర్మినల్ రన్వే, మొదలగు స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి రామకృష్ణప్రసాద్, ఎస్‌బిఐ డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, ఆర్డీవో భాగ్యరేఖ, తహశీల్దార్ నవీన్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విమానాశ్రయ పరిసరాల్లో గట్టి బందోబస్తు : ఎస్పీ
అనంతపురం జిల్లా నార్పలలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం లోని విమానాశ్రయం, పరిసర ప్రాంతాలలో గట్టి భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 220 మంది తో గట్టి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఒక డీఎస్పీ, నలుగురు సిఐలు, 12 మంది ఎస్‌ఐలు, 12 మంది ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, 125 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఏడుగురు మహిళా పోలీసులు, 24 మంది ఎఆర్‌పిసిలు, నలుగురు స్ఫెషల్‌పార్టీ పోలీసులు, 35 మంది హోగార్డులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా సమీక్షించిన ఎస్పి అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.










