Jul 11,2023 22:36

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి దత్తపుత్రుడో స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సమాధానం చెప్పాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సోమవారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జగన్‌ దత్త పుత్రుడు అని అన్నారన్నారు. ఆమె మాటల్ని బట్టి దత్త పుత్రుడు ఎవరో ముందుగా ఆమె వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సిద్దా రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడు వాలంటీర్ల పై నోరెత్తి మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వాలంటీర్ల వ్యవస్థలోని కొందరు వాలంటీర్ల పనితీరును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ అంటూ విమర్శలు చేయడం తగదన్నారు. కరోనా సమయంలో ప్రతిపక్ష బాధ్యతగల నాయకులుగా టిడిపి ఆధ్వర్యంలో వైద్యులకు పిపిఇ కిట్లు అందజేస్తే ఓర్వలేని స్థానిక ప్రజా ప్రతినిధి నేషనల్‌ ఆక్ట్‌ కింద కేసు నమోదు చేయించాలని పోలీసుల చేత నోటీసులు అందజేయాలని చూశారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకపోతే పథకాలు అందవని ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందినట్లే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసిపి చూస్తోందని అన్నారు. నేరాల గురించి మాట్లాడే ప్రజాప్రతినిధి కదిరిలో కొనుగోలు చేసిన గొడ్డలి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పై అనాలోచితంగా మాట్లాడితే అంతకు పదింతలు మాట్లాడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్‌ ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.