Sep 13,2023 16:45

ప్రజాశక్తి - భీమడోలు
    భీమడోలు హైస్కూల్‌ వేదికగా గత రెండు రోజులుగా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహిస్తున్న అండర్‌-14, అండర్‌-17 క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్‌.శ్రీనివాసరావు, గేమ్స్‌ మండల కోఆర్డినేటర్‌ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. తొలిరోజైనా మంగళవారం క్రీడా పోటీలను భీమడోలు మండల విద్యాధికారి ఇ.శ్రీనివాస్‌రావుతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్‌.శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తొలి రోజు నిర్వహించిన పోటీల్లో భాగంగా వాలీబాల్‌, కబడ్డీ, త్రో బాల్‌, షటిల్‌ గేమ్స్‌తో పాటు యోగా అంశం ఆధారంగా పోటీలు నిర్వహించారు. రెండవ రోజైనా బుధవారం రన్నింగ్‌, జంపింగ్‌, త్రో బాల్‌తో పాటు, టెన్నికాయిట్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, షటిల్‌ పోటీలను నిర్వహించారు. స్పోర్ట్స్‌లో, గేమ్స్‌ విభాగంలో వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి త్వరలో ఉంగుటూరు మండలంలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచి, పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఏ విధమైన రవాణా చెల్లింపులు ఇవ్వలేదు. ఇదేవిధంగా ఆటల మధ్య విరామ సమయంలో క్రీడాకారులు సేద తీరేందుకు సైతం సౌకర్యాలు లేకపోయాయి. భీమడోలు హైస్కూల్‌ యాజమాన్యం మధ్యాహ్న భోజనం పథకం ద్వారా భోజనాన్ని సమకూర్చారు. దీనితో అధిక శాతం క్రీడాకారులు వ్యక్తిగతంగా భరించగా, కొంతమంది క్రీడాకారులకు రవాణా ఛార్జీలను తాము సమకూర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు మండలానికి చెందిన ఫిజికల్‌ డైరెక్టర్లు డి.శేఖర్‌, ఎన్‌.ప్రసాద్‌, కృష్ణారావు, ప్రమీల, రాహుల్‌ పాల్గొన్నారు.