Aug 26,2023 21:08

సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉషశ్రీ చరణ్‌, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, కలెక్టర్‌ గౌతమి

          అనంతపురం ప్రతినిధి : తీవ్రమైన కరువు పరిస్థితులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ముక్తసరి చర్చలతోనే ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం రెండు గంటల్లోపు ముగిసింది. అంటే మూడు గంటల్లో జిల్లా స్థాయి సమస్యలపై చర్చ ముగియడం గమనార్హం. ఎప్పటిలాగానే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల హాజరు నామమాత్రంగానే ఉంది. మంత్రి ఉషశ్రీచరణ్‌, ఎమ్మెల్యే మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. శనివారం ఉదయం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ సమావేశంలో రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో వైద్యం, గృహ నిర్మాణం, స్త్రీ శిశు సంక్షేమం, వ్యవసాయం ఈ నాలుగు అంశాలపైనే చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా ఎక్కువగా గృహ నిర్మాణంపైనే చర్చ జరిగింది. గృహ నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలను ఎంపిపిలు, జడ్పిటిసిలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు తెలియకుండానే రద్దు చేసారని వాటిని మంజూరు చేయాలని బెళుగుప్ప, ఉరవకొండ ఎంపిపిలు కోరారు. దీనిపై కలెక్టర్‌ గౌతమి స్పందిస్తూ ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రాధాన్యమైనదని చెప్పారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసినా చాలా మంది లబ్ధిదారులు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. దీంతో కేంద్ర నుంచి వచ్చిన నిధుల వినియోగంలో ఇబ్బందులు వస్త్తున్నాయన్నారు. ఇప్పుడు నడుస్తున్న ఇళ్లు త్వరితగతిన నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి ముందుకు నడిపితే మరిన్ని ఇళ్లు మంజూరు చేయించడానికి ఇబ్బంది లేదన్నారు. వైద్య శాఖపై జరుగుతున్న చర్చలో ఓడిసి, రొద్దం మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణాలు ఆగిపోయాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సత్యసాయి జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి స్పందిస్తూ సాంకేతిక సమస్యతో నిర్మాణాలు ఆగిపోయాయని చెప్పారు. రోడ్లు భవనాల శాఖ నిర్మాణాలు చేపడుతోందన్నారు. సమస్యలు తెలుసుకుని పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.
కరువుపై నామమాత్రపు చర్చ..!
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితుల గురించి రెండు జిల్లాల వ్యవసాయాధికారులు నివేదికను సమావేశంలో తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యలేమైనా తీసుకుంటున్నారా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు అధికారులు స్పందిస్తూ ఇప్పటికే ప్రత్యామ్నాయ విత్తనాలను ఇచ్చేందుకు సిద్ధం చేసామన్నారు. వర్షాలు లేకపోవడంతో ఆ విత్తనం తీసుకునేందుకు కూడా రైతులు ముందుకు రావడం లేదని తెలిపారు. కరువు మండలాలు ప్రకటించాలని కూడేరు జడ్పిటిసి అడిగారు. దానికి ఇంకా సమయం ఉందని, సెప్టంబరులోనూ ఇదే విధంగా ఉంటే నివేదికను ప్రభుత్వానికి పంపుతామని వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌ సమస్యలతో పంటలు ఎండిపోతున్నా ఆ సమస్యపై ఈ సమావేశంలో చర్చ జరగకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మీసాల రంగన్న, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో కేతన్‌ గార్గ్‌, శ్రీసత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌.చేతన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కుషాల్‌ జైన్‌, జెడ్పీ డిప్యూటీ సీఈవో లలితాబాయితో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు, ఎంపిపిలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
ఒక్క మంత్రి...ఒక్క ఎమ్మెల్యేనే హాజరు
జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ సమస్యలపై చర్చించేందుకుగానీ, అధికారులకు మార్గ నిర్ధేశాలు ఇచ్చేందుకు జెడ్పీ సమావేశం ఎంతో కీలకం. అలాంటి సమావేశానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషచరణ్‌ శ్రీ హాజరయ్యారు. మంత్రి కూడా సమావేశం ముగియడానికి గంట ముందుగా మాత్రమే వచ్చారు. అంతకు మునుపు నుంచి ఉన్నది మాత్రం అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఒక్కరే. ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన ఒక్కరే ఈ సమావేశంలో ఉన్నారు. తక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏ ఒక్కరూ హాజరవలేదు. జిల్లాకు సంబంధించి జరిగే అతి ముఖ్యమైన సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
అధికారులే లేరు.. అభివృద్ధి ఎలా :రొళ్ల ఎంపిపి
రాష్ట్ర సరిహద్దుల్లోనున్న రొళ్ల మండలానికి సరైన అధికారులే లేరని రొళ్ల ఎంపిపి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఎంపిడిఒగా వచ్చేవారు కూడా లేరని అన్నారు. ఇప్పుడున్న ఎంపిడిఒ పగలే మద్యం సేవించి కార్యాలయంకు వస్తారని తెలిపారు. అటువంటి వ్యక్తితో ఏ విధంగా పనిచేయించుకోగలమని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంచి అధికారులను తమకు నియమించాలని కోరారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి
మంత్రి ఉషశ్రీచరణ్‌

జెడ్పీ సమావేశంలో సభ్యులు తీసుకొచ్చిన సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఉషాశ్రీచరణ్‌ సూచించారు. ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలకు ప్రహరీ ఎక్కడ అవసరమవుతాయో పరిశీలన చేయాలన్నారు. ఎక్కడెక్కడ అద్దె గదుల్లో కేంద్రాలు నడుస్తున్నాయో గుర్తించి సంబంధిత సిడిపిఓల ద్వారా వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ఐసిడిఎస్‌ పీడీకి పంపించాలన్నారు.
జిల్లాను అభివద్ధి పథంలో నడిపిద్దాం
జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ఉమ్మడి జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు.ఉమ్మడి జిల్లాలో 15వ ఫైనాన్స్‌ నిధులు రూ.20 కోట్ల కేటాయించి తాగునీరు, డ్రైనేజీలు, రహదారులు, తదితర అభివద్ధి పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో మరింత పురోగతి సాధించాలే సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆసుపత్రుల అభివృద్ధిపై దృష్టి సారించాలి
ఎమ్మెల్యే అనంత

నాడు, నేడు కింద ప్రభుత్వం పిహెచ్‌సిలు, ఆస్పత్రుల్లో చేపట్టిన అభివద్ధి పనులు, వచ్చిన మార్పులు, ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది నియామకం గురించి ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధికారులకు సూచించారు. ఖరీఫ్‌ సీజన్లోని జూన్‌, జూలై నెలలో ఏఏ రకాల పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ప్రస్తుతం ఏ రకమైన పంటలు సాగు చేయాలి అనే వివరాలను అధికారులు రైతులకు తెలియజేయాలన్నారు.