Sep 12,2023 22:28

చెరువులు

  అనంతపురం ప్రతినిధి:ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడొంతులు ఖాళీ చెరువులు దర్శనమిస్తున్నాయి. వర్షాభావం ప్రభావంతో రోజురోజుకూ నీటి నిలువలు తగ్గిపోతున్నాయి. గతేడాది మంచి వర్షాలు రావడంతో పుష్కలంగా నీటి జాడ జిల్లాలో కనిపించింది. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం నుంచి నెలకొన్న వర్షాభావంతో నీటి నిలువలు తగ్గిపోతున్నాయి. సెప్టంబర్‌ మాసం ప్రారంభంలో కొంత వర్షం పడినప్పటికీ సీజన్‌ మొత్తంగా పడాల్సినంత వర్షపాతం నమోదవ లేదు.
4.06 టిఎంసిలే మిగులు
     అనంతపురం జిల్లాలో జూన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వర్షాల మూలంగా పడిన వర్షపాతం 58.96 టిఎంసిలు. అందులో 9.89 టిఎంసిలు నీరు భూగర్భ జలాలుగా మారింది. 6.57 టిఎంసిలు తేమ రూపంలో ఉంది. 43.6 టిఎంసిలు ఆవిరి రూపంలో పోయింది. మొత్తంగాపోనూ నాలుగు టిఎంసిల వరకే నీరు నిలువుంది.
మూడొంతుల చెరువులు ఖాళీ
       ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1484 చెరువులున్నాయి. వీటిల్లో మూడు చెరువుల్లోనే నీరు పూర్తి స్థాయిలోనున్నాయి. 11 చెరువుల్లో 75 శాతం నీరుంది. ఇక 115 చెరువుల్లో 50 శాతం నీరుంది. 396 చెరువుల్లో 25 శాతం మాత్రమే నీరుంది. ఇక మిగిలిన 975 చెరువుల్లో చుక్కనీరు లేదు. అంటే మొత్తం చెరవుల్లో 65 శాతం ఖాళీగానే ఉన్నాయి. గతేడాది వర్షాలు పడి దాదాపు ఎక్కువ శాతం చెరువుల్లో నీరు పుష్కలంగా చేరి ఎక్కడ చూసినా జలకళ కనిపించేది. ఈ ఏడాది వర్షాభావం కారణంగా నీరు అడుగంటిపోతోంది. చెరువులు ఒక్కొక్కటిగా ఖాళీగా దర్శనమిచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికీ కొనసాగుతన్న వర్షాభావం
        ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులే కొనసాగుతున్నాయి. సెప్టంబర్‌లో ఒక మోస్తరు వర్షం నమోదయినప్పటికీ మండలాల వారీగా చూసినా, జిల్లల వారీగా చూసినా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 246.4 మిల్లీమీటర్లకుగానూ పడింది 185.5 మిల్లిమీటర్లు. 24.7 శాతం వర్షపాతం లోటుంది. ఇక సత్యసాయి జిల్లాలో సాధారణ వర్షపాతం 278.4 మిల్లీమీటర్లకుగానూ 182.4 మిల్లిమీటర్లు నమోదయింది. సాధారణం కంటే 34.5 శాతం వర్షపాతలోటుంది. మండలాల వారీగా చూస్తే 31 మండలాలకుగానూ అనంతపురం జిల్లాలో 21 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. సత్యసాయి జిల్లాలో 32 మండలాలకుగానూ 24 మండలాల్లో వర్షాభావం ఉంది. అందులో నాలుగు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.