ప్రజాశక్తి - ముదినేపల్లి
మండలకేంద్రమైన ముదినేపల్లిలో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పల్లపు ప్రాంతాల కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు నీరు కాలనీ వాసుల ఇళ్ల ముందు చేరడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకపోకలు సాగించేందుకు ఇక్కట్లు పడ్డారు. పలు కాలనీల్లో నీరు బయటకు వెళ్లే అవకాశం లేక రోజులు తరబడి ఇళ్లముందే నిల్వ ఉంటుంది. దీంతో కాలనీల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షంతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లు జలమయం కావడంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు అవస్థలు పడ్డారు. వర్షం రాకతో ముదినేపల్లి సెంటర్ బురదమయంగా మారింది. సెంటర్‌లో రహదారి విస్తరణ పనులు జరుగుతుండడంతో వర్షానికి బురద రోడ్డుపైకి చేరుతోంది. రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు చేరి దారి కనబబక ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం మండలంలోని ఖరీఫ్, వరి సాగుకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు.










