Sep 29,2023 19:35

ప్రజాశక్తి - ముదినేపల్లి
   మండలంలో శుక్రవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. మండల కేంద్రమైన ముదినేపల్లితో పాటు మండలంలోని సింగరాయపాలెం, శ్రీహరిపురం, కోమర్రు, చేవూరు, కాకరవాడ, కొరగంటపాలెం, బొమ్మినంపాడు, కొత్తపల్లి, వాడవల్లి, వైవాక, వడాలి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు, గ్రామాల్లోనే అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో పలు గ్రామాల్లో ఉన్న పల్లపు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి పల్లపు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి లోనైయ్యారు. దీంతో వర్షం నీటిలో నుంచి బయటకు రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలు సాగించేందుకు ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం రాకతో వ్యవసాయ కూలీలు మధ్యలోనే పనులు నిలుపుదల చేసి ఇళ్లకు చేరుకున్నారు. వర్షంతో చిరు వ్యాపారులకు బేరాలు లేకుండా పోయాయి. ఈ వర్షం ఖరీఫ్‌, వరి సాగుకు ఈ సమయంలో మంచి ఉపయోగకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాలవలు ద్వారా వచ్చే అర కొర సాగునీరు వరిచేలకు ఏమాత్రం సరిపోవటం లేదు. ఈ తరుణంలో కురిసిన వర్షం సార్వా వరి సాగుకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు రైతులకు ఊరట కలిగించింది. రెండు గంటల పాటు కురిసిన ఈ భారీ వర్షం సార్వా వరి చేలకు జీవం పోసినట్లైందని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.