Aug 26,2023 21:09

టీకాలు వేస్తున్న పశువుల వైద్యాధికారి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
పాడిపశువులకు ప్రాణాంతకంగా మారిన లంపీ స్కిన్‌ (ముద్దఛర్మం) వ్యాధికి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముందస్తుగానే టీకాలు వేసి పాడిపశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుతోంది. ఇందుకోసం పశుసంవర్థక శాఖాధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికే పశువులకు గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి టీకాలు ప్రభుత్వం అందజేస్తోంది. అలాగే గొర్రెలు, మేకలకు పారుడు రోగం, నీలి నాలుక వ్యాధికి టీకాలు అందజేసి సంరక్షిస్తోంది. తాజాగా ప్రాణాంతకమైన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకూ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ జిల్లాలో వ్యాధి లక్షణాలు కనిపించకున్నా, ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం టీకాలు వేసే కార్యక్రమం చేపట్టింది.
ప్రమాదకరమైన వ్యాధి
- పశువైద్యాధికారి వంశీ

ముద్దఛర్మ వ్యాధి ప్రమాదకరమైంది. ముద్దఛర్మ వ్యాధిని తొలిసారిగా 1992లో ఆఫ్రికా ఖండంలోని జాంబియాలో గుర్తించారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ముద్దఛర్మ వ్యాధి కేసులు నమోదయ్యాయి. 2022లో జిల్లాలో సుమారు వంద పశువులు మృత్యువాత పడ్డాయి. ఆవులు, దూడలకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులకు ఛర్మంపై బుడిపెలు, దద్దుర్లు ఏర్పడతాయి. ఇది వైరస్‌ ద్వారా పాడిపశువులకు వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన పశువుల్లో 10 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. 105 డిగ్రీల వరకూ జ్వరం వస్తుంది. ఛర్మం ముద్దగా మారుతుంది. పశువులు మేత, నీరు తీసుకోవడం మానేస్తాయి. కళ్లు, ముక్కు నుంచి నీళ్లు కారుతాయి. ముట్టెమీద, నోటి దూలం లోపల బుడిపెలు వస్తాయి. మెడ, తొడ దగ్గర లింప్‌ గ్రంథులు వాస్తాయి. పశువుల ఛర్మంపై బుడిపెలు ఏర్పడి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువులు మేత మేయక పాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఛర్మంతో పాటు పొదుగు, బాహ్య జననేంద్రీయాలపై దద్దుర్లు కనిపిస్తాయి. నొప్పి అధికంగా ఉండి పాలు పితకనియ్యవు. సకాలంలో వైద్యులను సంప్రదిస్తే ఫలితం ఉంటుంది. వ్యాధి సోకిన పశువుల్లో 1 నుంచి 5 శాతం వరకూ మృత్యువాత పడవచ్చు. ఒక గ్రామంలో అన్ని పశువులకూ వైరస్‌ సోకితే ప్రమాద స్థాయిపెరుగుతుంది.
గ్రామాల్లో 80 శాతం టీకాలు వేశాం
ఇప్పటికే మండలంలోని చిన్న పెండేకల్‌, పెద్ద పెండేకల్‌, ఆరెకల్‌, నాగలాపురం, పెద్దహరివాణంం, పెద్దతుంబలం, జాలమంచి, కుప్పగల్‌ తదితర గ్రామాల్లో 80 శాతం టీకాలు వేశాం. ఇప్పటికీ గ్రాములు మిగిలిన పశువులకు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలను పంపిణీ చేస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.