ప్రజాశక్తి - వీరఘట్టం : విద్యాశాఖకు అధిక శాతం నిధులు కేటాయించడంతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తుందే తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఈ కారణంగా గిరిపుత్రులు విద్యకు దూరమవుతున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు (ఎన్‌ఆర్‌ఎస్‌టిసి) ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా శాఖ విద్యాశాఖ అధికారులు మండలంలోని గాదిలంక గిరిజన గ్రామంలో ప్రత్యామ్నాయ పాఠశాలను గుర్తించి పాఠశాల నిర్వహణకు చర్యలు చేపట్టారు. గిరిజన తండాలో కిలోమీటరు దూరంతో పాటు అందుబాటులో పాఠశాల లేకపోతే ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 18మంది విద్యార్థులు విద్యను అభ్యసిం చేవారు. వీరికి అన్ని పాఠశాలల వలె పాఠ్యపుస్తకాలు, యూనిఫార, మధ్యాహ్నం భోజనం సదుపాయంతో పాటు వాలంటీర్‌ను కూడా నియమించారు. అప్పట్లో ఈ పాఠశాల విద్యార్థులు సామర్థ్యం ఏవిధంగా ఉందా అని డిఇఒ ఎస్‌డివి రమణ పరిశీలించి, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోలని వాలంటీర్‌ను ఆదేశించారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యామ్నాయ పాఠశాలలపై ఆసక్తి చూపకపోవడంతో ఇక్కడి పాఠశాలను ఎత్తివేశారు. దీంతో కిలోమీటరు దూరంలో ఉన్న మూలలంకలో ఉన్న పాఠశాలకు వెళ్లలేక పలువురు చిన్నారులు అంత దూరం నడవలేక ఇళ్లకే పరిమితమయ్యారు. తమ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో పిల్లలు అర్ధాంతంగా చదువులు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే అధికారులు స్పందించి తమ గ్రామంలో ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు చేసి తమ పిల్లలను విద్యను అందించాలని ఈ గ్రామ గిరిజనులు కోరుతున్నారు.
గౌరవ వేతనం అందక అవస్థలు
మండలంలోని గాదిలంకతో పాటు మరో 11ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పాఠశాలల నిర్వహణ కొనసాగించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలలో వాలంటీర్లకు ఇచ్చే గౌరవవేతన రూ.7,500 గాదిలంక వాలంటీర్‌కు అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పనిచేసే వాలంటీర్లకు గౌరవవేతనం అందినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దాదాపు 14 నెలలు కావస్తున్నా ఇంతవరకు గౌరవవేతన అందలేదని వాలంటీరు చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక విద్యాశాఖ అధికారి ఆర్.ఆనందరావు వద్ద 'ప్రజాశక్తి' సోమవారం ప్రస్తావించగా వాలంటీరుకు గౌరవ వేతనం అందలేదని వాస్తవమేనని, ఈ విషయాన్ని జిల్లా స్థాయి ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరణ ఇచ్చారు.










