ప్రజాశక్తి పుట్టపర్తి క్రైమ్ : యువత గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిస కాకుండా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని టిడిపి నాయకులు కోరారు. మంగళవారం స్థానిక హనుమాన్ సర్కిల్ లో టిడిపి జిల్లా కార్యదర్శి సామ కోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ తెలుగు యువత ప్లకార్డుల ద్వారా యువత మేలుకో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు ఏరులై పారుతున్నాయన్నారు. వాటికి బానిసై యువత చాలామంది పెడితోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అక్రమార్కులు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారని వాటిని పోలీసులు అరికట్టాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అమ్మినేని కేశవ నాయుడు, శ్రీనివాసులు, పాపా రెడ్డి, మహేష్, వెంకటేష్, నరసింహులు, వెంకట నాయుడు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.










